సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) మిద్దె రాములు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక వేడుకను గురువారం మధ్యాహ్నం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన అలిశెట్టి ప్రభాకర్ వేదికలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానయోధులుగా నిలుస్తారని ఆయన సూచించారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, కార్యదర్శి శృతికాంత్ భారతి, కోశాధికారి పి. రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనం లేకపోతే చరిత్రను మర్చిపోతాం
పుస్తక పఠనం లేకపోతే చరిత్రను మర్చిపోయే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన ఓ సర్వేను పరిశీలిస్తే 74శాతం అమెరికన్లు తమకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని ప్రశ్నవేస్తే చెప్పలేకపోయారు. దీనికి కారణం పుస్తకాన్ని మర్చిపోవడమే. 75వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని 80 లక్షల మంది విద్యార్థులు వీక్షించారు. దీని ద్వారా వారు చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. అందుకే పుస్తకం చదవడం ఒక అభిరుచిగా మార్చుకోవాలి.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
పుస్తక పఠన దినంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పుస్తక పఠన దినంగా పాటించాలి. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఒకరికొకరు బహుమానంగా పుస్తకాలనే ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే నేటి విద్యార్థులు రేపటి భారత జ్ఞానయోధులుగా నిలువగలుగుతారు. పుస్తకాలను విరివిగా చదివి, రాయాలి.
– జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, సాహిత్య అకాడమీ చైర్మన్
పాండిత్యంతో అవకాశాలు మెండు..
పుస్తకాల్లోనే జ్ఞానం ఉంది. పాండిత్యాన్ని సాధిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు మెండుగా ఉంటాయి. జ్ఞానంతోనే చరిత్రలో నిలిచి గెలిచేందుకు అవకాశం ఉంటుంది. పుస్తక ప్రదర్శన అనడం కంటే.. పుస్తకాల జాతర, పండుగ, వేడుక అని పిలువాలె.
– తిగుళ్ల కృష్ణమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్