ఖమ్మం, ఆగస్టు 24: ఖమ్మం వర్తకులకు, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగానే ఉన్నామని, మీ సహకారంతోనే ఖమ్మం త్రీటౌన్ను సంపూర్ణంగా అభివృద్ధి చేశామని అన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. గడిచిన 9 ఏళ్లల్లో త్రీటౌన్ను ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఇకముందు కూడా ముల్లుకర్ర పట్టుకుని మరీ మీ వ్యాపారాలకు, త్రీటౌన్కి కాపలాగా ఉంటానని అన్నారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట చెప్పి కట్టుబడి ఉన్నానని గుర్తుచేశారు. త్రీటౌన్ అభివృద్ధి జరగాలంటే ముందు గోళ్లపాడు ప్రక్షాళన కావాలని భావించానని అన్నారు. సరిగ్గా 2018 ఏప్రిల్ 19న తన పుట్టిన రోజు సందర్భంగా త్రీటౌన్‌లో ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో వాసవి గార్డెన్స్ వద్ద గోళ్లపాడు కాలువలోకి తానే స్వయంగా దిగి శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టానని గుర్తుచేశారు.
గోళ్లపాడు ఆధునీకరణతో త్రీటౌన్ ప్రాంతమంతా పరిశుభ్రమైందని, లక్షలమంది ఆహ్లాదంగా ఉండేలా పార్కులతో తీర్చిదిద్దానని వివరించారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలని బలంగా కోరుకుంటున్నానని అన్నారు. అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అజయ్ అభ్యర్థిత్వాన్ని ఆర్య వైశ్య సమాజం సంపూర్ణంగా స్వాగతిస్తోందని, వారి గెలుపును తమ బాధ్యతగా స్వీకరిస్తున్నామని అన్నారు. అతి త్వరలో ఆర్యవైశ్యుల అధ్వర్యంలో ఖమ్మంలో భారీ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఐక్యంగా పని చేసి గెలిపించుకుంటామని అన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు పునుకొల్లు నీరజ, వేములపల్లి వెంకన్న, చిన్ని కృష్ణరావు, కొప్పు నరేశ్‌కుమార్, గుర్రం ఉమామహేశ్వరరావు, దేవత అనిల్, గోళ్ల రాధాకృష్ణ, జీ.శ్రీనివాస్, కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, కొత్త వేంకటేశ్వరరావు, కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 24: దివ్యాంగులను స్వశక్తులను చేసేందుకు జూన్ నెల నుంచి పింఛన్లు పెంచినట్లు మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. కొత్తగూడెం ఐడీవోసీ కార్యాలయపు సమావేశపు హాల్లో గురువారం నిర్వహించిన క్రమబద్ధీకరణ పట్టాలు, దివ్యాంగుల పింఛన్ మంజూరు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీలో ఆయన మాట్లాడారు. రూ.4016కు పెంచిన పింఛన్ల ద్వారా భద్రాద్రి జిల్లాలో 13,770 మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డీ.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీవో మధుసూదన్‌రాజు పాల్గొన్నారు.