రఘునాథపాలెం, నవంబర్ 30: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ 8.00గంటల వరకు మందకోడిగానే సాగింది. 9గంటల తరువాత ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు బారులు తీరి కన్పించాయి. ప్రజలు స్వచ్చందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మహిళలే అత్యధిక శాతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక ఐటీబీటీ సిబ్బందిని నియమించింది.

మండలంలోని పలు గ్రామాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ర్టాలకు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. కాగా మండలంలో 39,822 ఓటర్లు ఉండగా 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలైనా ఓటర్లు పలు చోట్ల వరుసలో ఉండటంతో అధికారులు వారికి స్లిప్పులు అందించి వారిచేత ఓటు వేయించారు. రేగులచలకలో 7గంటల వరకు ఓటర్లతో ఓటు వేయించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు మంచినీరు, టాయిలెట్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సారి దివ్యాంగులకు, 80ఏళ్లు పైబడిన వృద్ధులతో ఓటు వేయించేందుకు ప్రత్యేక ఆటో సదుపాయాలను కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వారిని బూత్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వీల్‌చైర్ సదుపాయం సైతం ఏర్పాటు చేశారు. కేంద్రాల ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లు, అశవర్కర్లు, వైద్య సిబ్బంది కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందించారు.

పోలీస్‌శాఖ వారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వకుండా ఓటర్లు, నాయకులతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం అర్బన్ కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఖమ్మం నగరం కార్పొరేషన్ పరిధి విలీన పంచాయతీల్లోనూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. వీ వెంకటాయపాలెంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సతీమణితో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాలేరులో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన మంద సంజీవరావు తన స్వగ్రామం మంచుకొండలో తన ఓటు వేశారు. వేపకుంట్ల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ జయంత్ పరిశీలించారు.