‘రాజకీయ అరంగేట్రం చేసిన తొలిరోజు నుంచే గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలే నా అండాదండా.. ఖమ్మం ప్రాంత అభివృద్ధే నా ఎజెండా.. అజయ్‌కు ఆడంబరాలు ఇష్టముండవు.. కష్టం ఎవరికి కలిగితే వారి ఇంటిముందు నిల్చోవడం మా కుటుంబ ఆనవాయితీ.. ప్రజల్లో ఒక్కరిగా ఉండడానికే ఇష్టపడతా.. ప్రతి రాజకీయ అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగించా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా మహోన్నత అవకాశాన్ని కల్పించిన ఖమ్మం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీకి రాష్ట్ర మంత్రిగా నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా గురువారం ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి, జిల్లాలో పార్టీ బలోపేతమైన తీరు, వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు చేస్తున్న కృషిపై సుదీర్ఘంగా ముచ్చటించారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఖమ్మం నియోజకవర్గాన్ని నాలుగేండ్లలో అన్ని విధాల సర్వహంగులతో అభివృద్ధి చేశాను. తెలంగాణకే ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తీర్చిదిద్దాను. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటాం. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
మంత్రి : రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీఎం కేసీఆర్ సాయంతో సామరస్యంగా పరిష్కరించాం. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చేసిన కృషి మంచి సంతృప్తిని, కార్మికులకు చేసిన సేవ మధురానుభూతిని మిగిల్చింది. కష్టాల కడలిలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన విషయం తెలిసిందే. దీనిలో నేను మంత్రిగా కీలకపాత్ర పోషించడం, శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం మరిచిపోలేని తీపి జ్ఞాపకం. 43 వేల మంది ఆర్టీసీ కుటుంబాల జీవితాల్లో వెలుగునింపాం. మంత్రిగా ప్రతి సమస్యను అధ్యయనం చేసి దాని పరిష్కారానికి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగా పని చేయడం నా పూర్వజన్మసుకృతం. ప్రతి సందర్భంలో ఒక అనుభవం నేర్చుకున్నా.. ప్రతి విషయంలో సక్సెస్ అయ్యా. ఈ నాలుగేండ్లలో అనేక సందర్భాల్లో కొంతమంది నా కాళ్లలో కట్టెలు పెట్టాలని చూసినా వాటిని దాటుకుంటూ ముందుకు నడిచానే తప్ప వెనుతిరగలేదు.
మంత్రి : ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. గోదావరి నీళ్లను ఖమ్మం జిల్లాకు తీసుకవచ్చే సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువల నిర్మాణం శరవేగంగా పూర్తికావొస్తున్నది. ఇల్లెందులో కొత్తగా ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేశాం. మధిర, పాలేరు, సత్తుపల్లిలో అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాం.
మంత్రి : ఖమ్మం నియోజకవర్గ 76 ఏండ్ల చరిత్రలో మంత్రిగా అవకాశం నాకు మాత్రమే దక్కింది. నాలుగేండ్లలోనే నియోజకవర్గ రూపురేఖలను పూర్తిగా మార్చాను. జిల్లాకేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు ఖమ్మాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు లేడు. నాకు అవకాశం వచ్చింది చేశాను.. అందుకే ఖమ్మం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. కట్ట కట్టుకొని వచ్చి నన్ను ఓడించాలని చూసినా గత ఎన్నికల్లో ప్రజలు నా వెంటే ఉండి నన్ను గెలిపించారు.
మంత్రి : 2018 శాసనసభ ఎన్నికల అనంతరం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా విజయాలు సాధించింది. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు, జడ్పీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, సొసైటీ, స్థానికసంస్థల ఎన్నికల్లోనూ మీమే విజయం సాధించాం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం, సత్సంబంధాలు ఉన్నవి. నా అవసరం ఉన్నచోట మంత్రిగా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధిపథంలో పయనిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యహితంగా కార్యక్రమాలు ఉంటాయి. ఆయా ఎమ్మెల్యేల నేతృత్వంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటాయి.
మంత్రి : నేను ఇక్కడే పుట్టా.. ఈ మట్టిలోనే కలుస్తా.. అందుకే నా ఖమ్మంను అభివృద్ధి చేయాలనే తలంపుతో ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వచ్చాను. ఖమ్మం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఇప్పుడు ఖమ్మం జనాభా 5లక్షల దాకా చేరింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తా. మున్నేరుపై తలపెట్టిన అన్ని పనులను పూర్తిచేస్తా.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని 10 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలిన ప్రజలు నమ్మేది బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోనివారెవరో ప్రజల కోసం పరితపిస్తున్నవారెవరో ఉమ్మడి ప్రజలందరికీ తెలుసు.
మంత్రి : సాధారణంగా నేను ప్రజాక్షేత్రంలో ఉంటూ అందుబాటులో ఉండే వ్యక్తిని. పనుల కోసం ప్రజలను నా కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం ఇష్టముండదు. అందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకెళ్లి అందిస్తున్నాను. వారి ఇంటిగడప తొక్కి ఆడబిడ్డలకు చెక్కులకు అందించినప్పుడు వారినుంచి లభించిన అపూర్వ ఆదరణ, వారి కండ్లలో కనిపించిన సంతృప్తి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. అలాగే ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి రాష్ర్టానికే ఆదర్శమంటూ అనేకమార్లు శాసనసభలో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రస్తావించడం ఎనలేని సంతృప్తినిచ్చింది. ఈ ప్రశంసను ఖమ్మం ప్రజలకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను.
మంత్రి : మున్నేరుకు వరద వచ్చిన ప్రతిసారి పునరావాస కేంద్రాలు, భోజనాలు ఏర్పాటు చేయడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. మున్నేరు ముంపువాసుల కష్టాలను సీఎం కేసీఆర్‌కు చెప్పగానే ఆర్సీసీ వాల్ కోసం రూ.690 కోట్లు మంజూరు చేశారు. అతిత్వరలో టెండర్లు పిలుస్తాం.. అంతేకాదు మున్నేరుపైన కాల్వొడ్డు వద్ద వందేండ్ల క్రితం బ్రిటీష్‌వారు కట్టిన బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. దీంతో ఆ స్థలంలో రూ.180 కోట్లతో తీగల వంతెనను కట్టబోతున్నాం. ప్రకాశ్‌నగర్ వద్ద చెక్‌డ్యామ్ కట్టాం. మరో 3 చెక్‌డ్యామ్‌ల కోసం రూ.30 కోట్లు మంజూరు చేశాం.. సరాసరి ఈ మొత్తం 900 కోట్లు కాగా పనులు పూర్తయ్యేనాటికి అంచనాలు పెరిగి మొత్తం రూ.1000 కోట్లు అవుతుంది.
మంత్రి : ఖమ్మం అంటేనే ఈ రోజున రాష్ర్టానికే మోడల్‌గా తీర్చిదిద్దాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఖమ్మాన్ని ఎంతో సుందరంగా మార్చాను. సుమారు రూ.2 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. మరో రూ.1000 కోట్ల పనులకు ఈ నెల చివరిలో శంకుస్థాపనలు చేయబోతున్నాం. నూతన బస్టాండ్, నూతన కార్పొరేషన్ కార్యాలయం, ఐటీ హబ్, ధంసలాపురం బ్రిడ్జి, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, రోడ్లు, డివైడర్లు, నూతన కలెక్టరేట్, నూతన పోలీస్ కమిషనరేట్, మున్నేరు చెక్‌డ్యాం, లకారం ట్యాంక్‌బండ్.. ఇలా చెప్పుకుంటేపోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఖమ్మాన్ని నాలుగువైపులా అభివృద్ధి చేశాను. బోనకల్ రోడ్డులో ధంసలాపురం బ్రిడ్జి నిర్మించి ముస్తాఫానగర్, చర్చికాంపౌండ్, బోనకల్ రోడ్డు అభివృద్ధి చేయలేదా? వైరా రోడ్డులో నూతన కలెక్టరేట్ వరకు నాలుగులైన్ల రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టలేదా? త్రీటౌన్‌లో రోడ్లు వేయలేదా? గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు చేసి దానిపైన పార్కులు నిర్మించలేదా? నగరంలోని అన్ని డివిజన్ల్లో వీడీఓఎఫ్ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వేయలేదా? ఆలోచించాలి.. వీటన్నింటిని కాదని మమత చుట్టూ ప్రత్యేకంగా చేసింది ఏమిటి? లకారంను అభివృద్ధి చేయడం ద్వారా ఖమ్మానికి పర్యాటకంగా పేరువచ్చింది.