ఖమ్మం, నవంబర్ 3: ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడితోటలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో సకల ఉద్యోగుల కార్తీకమాస వన సమారాధన, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జరిగింది.
దీనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, చైర్మన్ మారం జగదీశ్వర్ కలిసి మంత్రులతను శాలువాలతో సతరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లిస్తూ వారికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తూ ఉద్యోగులపై భారం తగ్గిస్తున్నామన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి. జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాసరావు, వనజీవి రామయ్య, సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగ సంఘాల తరఫున సతరించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, శాసనమండలి సభ్యుడు ఏ.నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, ప్రజాప్రతినిధులు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ, జేఏసీ నాయకులు కస్తాల సత్యనారాయణ, వేదాద్రి, రుక్మారావు, ఉద్యోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.