కూసుమంచి, సెప్టెంబర్ 4 : మండలంలోని నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులు వరదల్లో మృతిచెందిన విషయం విదితమే. వారి కుటుంబసభ్యులకు బుధవారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఆర్థికసాయం చెక్కులను అందజేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల సాయాన్ని ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కులను యాకూబ్ సోదరుడు లాల్సాబ్ ఇంటి వద్ద మృతుల కుమారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వారిని బతికించాలని చాలా ప్రయత్నాలు చేశాం.. కానీ ఫలితం దక్కలేదు.. మీ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీవో గణేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వరదల్లో నాయకన్‌గూడెంలో ముగ్గురు ఇంటిపై కప్పుపై ఉండగా వారికి లైఫ్‌జాకెట్లు, ట్యూబ్‌లు అందించిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, వ్యవసాయ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. అందరి సహకారంతో ఒక ప్రాణాన్ని కాపాడుకోగలిగామన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాఫ్టర్ రాలేదనే విషయాన్ని కుటుంబ సభ్యులకు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.