ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇల్లెందులోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.5 కోట్లు, మొండికుంట నుంచి రామచంద్రరావుపేట వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్లకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
పట్టణంలో రూ.కోటి వ్యయంతో స్విమ్మింగ్ పూల్, బుగ్గవాగు బ్రిడ్జి రిటైనింగ్ వాల్, ఆడిటోరియం, ఫౌంటెన్లు, మోడల్ మార్కెట్‌కు ప్రహరీ, ఆర్అండ్ఆర్ కాలనీలో రూ.1.30 కోట్ల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొజ్జాయిగూడెం ఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని, అవసరమైతే పోలీసు శాఖ సహకారం తీసుకోవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ శాఖల్లో మంజూరైన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కాని వాటికి ప్రతిపాదనలు పంపిస్తే మంజూరయ్యేందుకు కృషి చేస్తానన్నారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతగా పని చేయాలని సూచించారు. త్వరలోనే రేషన్, హెల్త్ కార్డులతోపాటు అర్హులకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి పాటిల్, అద్వైత్‌కుమార్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సొసైటీ చైర్మన్లు మూల మధుకర్‌రెడ్డి, వడ్లమూడి దుర్గాప్రసాద్, మేకల మల్లిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.