కూసుమంచి, అక్టోబర్ 8: కుల వృత్తులను ప్రోత్సహిస్తే అనేక లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు రిజర్వాయర్‌లో ఇటీవల వరదలతో నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఇది మంచినీటి చెరువు కావడంతో ఇందులో చేపలతోపాటు రొయ్యల పెంపకానికి కూడా అవకాశం ఉందని అన్నారు.
అందువల్ల రొయ్య పిల్లలు కూడా పోసి ఎక్కువ ఆదాయాన్ని పొందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర మత్స్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన పాలేరు రిజర్వాయర్‌లో మంగళవారం జరిగిన చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జలాశయంలో చేపపిల్లలను వదిలిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఇటీవలి వరదలకు తెప్పలు, వలలు నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రకృతి విపత్తుల నిధులు ఎలా కేటాయించాలనే విషయంపై మత్స్యశాఖ కమిషనర్‌తో చర్చించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పాలేరులో ప్రస్తుతం 7 లక్షల చేప పిల్లలు వదులుతున్నామని, ఇంకా కావాలని అడుతున్నందున మిగిలిన వాటిని కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను పలువురు మత్స్యకారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. పాలేరు మత్స్య సంపదకు పూర్వ వైభవం తెస్తామని అన్నారు. మత్స్యశాఖ చైర్మన్ సాయికుమార్ మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతిచోటా చేపల పెంపకానికి చర్యలు చేపడతామని అన్నారు.
ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, అడ్‌హక్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, పాలేరు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఇస్లావత్ ఉపేందర్, జిల్లా అధికారి శివప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కాగా, ఎనిమిదేళ్లుగా ఎన్నికలు జరగని పాలేరు మత్స్యకారుల సంఘానికి ఇప్పుడైనా ఎన్నికలు జరపాలని కోరుతూ మత్స్యకారులు మంత్రికి వినతిపత్రం అందించారు. దళారులను రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, మత్స్యకారుల్లోని వర్గపోరు సభలో కనిపించింది.