వేంసూరు, ఏప్రిల్ 3: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రైతులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వరకు పయనిస్తున్నారని, కేసీఆర్‌ను ప్రతిఒక్కరూ ఆశీర్వదించి జాతీయస్థాయి రాజకీయాలకు పంపాలన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ర్టాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ.లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత సొమ్ము వెచ్చిస్తున్న ప్రభుత్వాలు లేవన్నారు. కేంద్రం మాత్రం వ్యవసాయరంగాన్ని చిన్నచూపు చూస్తున్నదన్నారు.
రైతులను అవమానపరుస్తున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మాయమాటలతో పబ్బం గడుపుతున్నదన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. రైతులకు పైసా ప్రయోజనం చేయలేదన్నారు. ఉపాధి పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్న కేంద్రం ఇప్పటివరకు దాని ఊసు ఎత్తడంలేదన్నారు. కనీస మద్దతు ధర అంశంపై ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పి ఆ విషయాన్ని అటకెక్కించిందన్నారు. నల్లచట్టాల అమలుకు 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదన్నారు. 60 ఏళ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు ఇస్తామని చెప్పిన హామీ నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది రైతులను మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. సంవత్సరానికి నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ కూడా గాలిలో కలిసిపోయిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారన్నారు.
రెండోసారి నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని, సర్వే అనంతరం వారికి కూడా నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారన్నారు. వేంసూరు ఆత్మీయ సమ్మేళనానికి మహిళలు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు సమ్మేళనంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, వేంసూరు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ స్థల పరిశీలన..
సమ్మేళనం తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డి వేంసూరు మండలంలోని కల్లూరుగూడెం గ్రామంలో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీ స్థలాన్ని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంత రైతులకు ఫ్యాక్టరీ అవసరమని గుర్తించి సీఎం కేసీఆర్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని మంత్రి అన్నారు. అందుకు రూ.230 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. రైతు శ్రమను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్న మహానాయకుడు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సత్తుపల్లి ప్రాంత రైతుల కోసం సీఎం కేసీఆర్ పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. కూలీ నుంచి ఉన్నతవర్గాల వరకు మూడు పూటలా అన్నం తింటున్నారంటే అది కేవలం రైతు శ్రమతోనే సాధ్యమైంది. అలాంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆయిల్ పాం రైతుల కోసం సీఎం కేసీఆర్ వేంసూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మరోసారి కేసీఆర్‌ను ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టాలి.
– రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి
‘సీతారామ’తో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం..
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుంది. ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చింది. రైతులకు అవసరమైన అన్ని వనరులు అందజేసేందుకు ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. సాధించుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. రైతులకు మేలు చేస్తున్నారు. నాటి కరువు మండలాల్లో వేంసూరు, తిరుమలాయపాలెం మండలాలు ఉండేవి. నేడు ఆ మండలాలు సస్యశ్యామలమయ్యాయి. నా పరిధిలో సత్తుపల్లి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఇదే ఒరవడిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన శక్తి మేరకు పనిచేస్తున్నారు. – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి..
నా జీవితం ప్రజా సేవకే అంకితం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాను. బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టాలి. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదించే విధంగా పనిచేయాలి. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి పల్లె ప్రగతి బాట పట్టింది. ప్రతి పల్లెలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయి.ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి సాయం అందింది. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదించాలి. – సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య