భద్రాచలం, నవంబర్ 19 : ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ భద్రాచలం రోడ్ షో విజయవంతమైంది. షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా రోడ్‌షో ప్రారంభమైనప్పటికీ చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎంతో ఓపికతో ఎదురుచూశారు. అంబేద్కర్ సెంటర్లోని రవి లాడ్జి, భగవాన్ స్వీట్స్ భవనంపై, పక్కనే ఉన్న రూపా ఆటో మొబైల్స్ భవనాలపై ప్రజలు ఎక్కి కేటీఆర్ రోడ్‌షోను తిలకించారు. కేటీఆర్ వచ్చి రావడంతోనే బారికేడ్లకు ఆవల ఉన్న ప్రజలతో కరచాలనం చేయడంతో ప్రజలు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. ఒక్కసారిగా మంత్రి కేటీఆర్ ప్రజల దగ్గరకు వెళ్లడంతో వారు మురిసిపోయారు. తమ ఆరాధ్య నాయకుడిని అతిదగ్గర నుంచి చూడటమే కాకుండా తమతో కరచాలనం చేయడంతో వారి ఆనందంతో పొంగిపోయారు. అనంతరం ఆయన మహిళలను ఉద్ధేశించి మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి నెల రూ.3 వేలు అందజేస్తామని, అలాగే మీ అత్తలకు, అమ్మలకు కూడా ఆసరా పింఛన్లు రూ.5 వేలు ఇస్తామని చెప్పగానే మహిళలు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీ కవిత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
వాజేడు, నవంబర్ 19 : భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు విజయం కోసం ఆదివారం భద్రాచలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్‌షోకి వాజేడు మండలం నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వాహనాలను జగన్నాథపురం వై జంక్షన్ నుంచి మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జై బీఆర్ఎస్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. సోమిడి నర్సింహారావు, బోల్లె ఆదినారాయణ, కవిరాజు, వినోద్, మల్లయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 19 : భద్రాచలంలో జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్‌షోకి వెంకటాపురం మండల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగాగా తరలివెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు, గూడవర్తి నర్సింహమూర్తి, పిల్లారశెట్టి మురళి, ముడుంబా శ్రీనివాసరావు, డర్రా దామోదర్, ముస్తఫా ఉన్నారు.
దుమ్ముగూడెం, నవంబర్ 19 : మండల కేంద్రమైన లక్ష్మీనగరంతోపాటు మండలవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం భద్రాచలంలో జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు భారీగా తరలివెళ్లారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, మండల కార్యదర్శి కణితి రాముడు ఆధ్వర్యంలో వీరంతా ఆయా గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాలతో భద్రాచలం రోడ్‌షోకు తరలివెళ్లారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
భద్రాచలం, నవంబర్ 19 : భద్రాచలం రోడ్‌షోలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య సీతారామచంద్రస్వామి ప్రతిమను అందజేశారు. సారపాక హెలిపాడ్ వద్ద ఆయనకు బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుచ్చయ్య రామయ్య ప్రతిమను మంత్రి కేటీఆర్‌కు అందించారు.
భద్రాచలం, నవంబర్ 19 : తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్.సత్యం(గొల్ల డాక్టర్) బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో జరిగిన కేటీఆర్ రోడ్ షోలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో తగిన గౌరవం దక్కకపోవడంతో తెల్లం వెంకట్రావును ఎలాగైనా ఈసారి గెలిపించుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్లో చేరారు. డాక్టర్ సత్యం చేరికతో భద్రాచలంలో బీఆర్ఎస్ మరింత పుంజుకోనున్నది.