ఖమ్మం, సెప్టెంబర్ 14: సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. ఖమ్మం లో మమత వైద్య విద్యాసంస్థల రజతోత్సవానికి గురువారం ఆయన హాజరయ్యారు. తొలుత నూతనంగా నిర్మించిన సిల్వర్ జూబ్లీ బ్లాక్‌ను ప్రారంభించారు. మమత సంస్థల రజతోత్సవ కార్యక్రమాలను మమత ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా దినదినాభివృద్ధి చెందుతున్న మమత వైద్య సంస్థలు వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయని అన్నారు. అనేకమంది వైద్యులుగా తీర్చిదిద్దిన ఘనత మమత సంస్థలకు దకుతుందని అన్నారు. రాజకీయ వేత్తగా పువ్వాడ నాగేశ్వరరావుకు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని, 85 ఏళ్ల వయసులోనూ జిల్లా అభివృద్ధి గురిం ఆలోచనలు చేస్తున్నారంటే ఆయన పోరాట పటిమ ఏంటో అవగతమవుతోందని అన్నారు.
మమత కళాశాలల స్థాపనకు, విస్తరణకు ఎవరు తోడ్పాటునందించారో, ఎవరు కాలు అడ్డం పెట్టారో తమకు తెలుసునని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. సహకరించిన వారికి రజతోత్సవ వేడుకల వేళ సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. 25 ఏళ్ల నాడు మమత కళాశాల స్థాపన కోసం ఢిల్లీ వెళితే తమ వద్దకు రావద్దంటూ చెప్పిన వారే.. ఇప్పుడు మమత సంస్థల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమత సంస్థల విస్తరణకు ముఖ్యంగా 2018లో హైదరాబాద్ బాచుపల్లిలో మమత కళాశాలను స్థాపించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన తోడ్పాటు మరువలేనిదని అన్నారు.