ప్రజలకు అండగా ప్రభుత్వం
సహాయక పునరావాస చర్యలకు హెలీక్యాప్టర్ సిద్ధం
వరదల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లొద్దు
గోదావరి ప్రవాహం 66 అడుగులకు చేరే ప్రమాదముంది
ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనే వ్యూహంతో ఉన్నాం
గోదావరి వరదల సమీక్షలో మంత్రి అజయ్‌కుమార్
భారీ వరదల నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోనే బస..
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహం వల్ల గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కాస్తంత తగ్గిన ప్రవాహం బుధవారం ఉదయానికి మళ్లీ పెరగడంతో భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలోని సుభాశ్‌నగర్ పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంటే తక్షణ సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలిక్యాప్టర్‌ను ఏర్పాటు చేసిందని, ఐటీడీఏ, ఐటీసీలో హెలీప్యాడ్లను సిద్ధం చేసి ఉంచామని అన్నారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీస్ యంత్రాంగంతోపాటు సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు బలగాలతో సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. ప్రవాహం ఇలాగే ఉంటే భద్రాచలం వద్ద గోదావరి వరద 66 అడుగులకు చేరే ప్రమాదం ఉందన్నారు. గత అనుభవాల దృష్ట్యా వరదలపై స్పష్టమైన అంచనా ఉందని, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనే వ్యూహంతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలు సంయమనం పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.