అశ్వాపురం, నవంబర్ 24: మారుమూల గ్రామాల్లో వలస ఆదివాసీల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తున్నదని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. అశ్వాపురం మండలంలోని గిరిజన మారుమూల గ్రామమైన వేములూరులో ఆదివాసీల ఆరోగ్య సంక్షేమం కోసం భద్రాచలం రోటరీ క్లబ్ సహకారంతో అశ్వాపురం పోలీసు శాఖ ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములూరు, మనుబోతులగూడెం, మల్లయ్యగుంపు, గుండ్లమడుగు వలస గొత్తికోయ గ్రామాల ఆదివాసీల కోసం ఈ వైద్యశిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. మావోయిస్టుల సమాచారం తెలిస్తే పోలీసు శాఖకు అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో కలిసి ఎస్పీ అక్కడ భోజనం చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతిరావు, రవూఫ్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలాజీ, వైద్యులు పాల్గొన్నారు.