ఖమ్మం సిటీ, ఆగస్టు 8 : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సుడా నిధులు రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
వాటిల్లో రూ.23.75 కోట్లతో యాబై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నిర్మిస్తున్నామని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉపయోగపడే యంత్రాల కొనుగోలు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు పంపించాలని, అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తామన్నారు.
పేషెంట్స్ కోసం టాయ్‌లెట్స్ మరమ్మతు పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో ఉన్న యంత్రాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై రిపోర్ట్ తయారు చేయాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన ఇన్ఫ్రా సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని చెప్పారు.
పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, దవాఖానకు కార్పొరేట్ శోభను తీసుకురావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అనుదీప్ అభిప్రాయపడ్డారు. అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే డీఎంఎఫ్టీ, ఇతర నిధులను మంజూరు చేస్తామని హామీఇచ్చారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం నరేందర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ కళావతిబాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్‌గౌడ్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బీ కిరణ్‌కుమార్, పలు విభాగాల హెచ్వోడీలు డాక్టర్ ఎల్ కిరణ్‌కుమార్, డాక్టర్ బాబూరత్నాకర్ పాల్గొన్నారు.