మామిళ్లగూడెం, మార్చి 18 : అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్‌వోలతో కలిసి అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనకగిరి ఘాట్ అటవీ ప్రాంతానికి సంబంధించి కొంతభాగం భూమి రికార్డ్స్, సరిహద్దులు సరిగా నమోదుకాలేదని అన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాంతరంగా సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అటవీ, రెవెన్యూశాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని, వీరు 15 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోర్టు కేసులు మినహాయించి రెవెన్యూ, అటవీశాఖల మధ్య ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పరిష్కారమయ్యే సర్వే నెంబర్ వివాదాలను రెవెన్యూ, అటవీ అధికారులు మండలాల వారీగా ఎంపిక చేయాలని సూచించారు. జాయింట్ సర్వే చేపట్టే ముందు అటవీ, రెవెన్యూ అధికారులు కూర్చొని గైడ్‌లైన్స్ ప్రేమ్ చేసుకుని సులభంగా పరిష్కారమయ్యే సర్వే నెంబర్లను ఎంపిక చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం డీఎఫ్‌వో సిద్ధార్ధ విక్రమ్‌సింగ్, కొత్తగూడెం డీఎఫ్‌వో కృష్ణాగౌడ్,, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.