మామిళ్లగూడెం, మార్చి 1: విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. తొలిమెట్టు, టెన్త్ పరీక్షలు, క్రీడా గ్రాంట్ వినియోగం, టెన్త్ విద్యార్థులకు స్నాక్స్, ఎస్ఎంసీలకు చెల్లింపులు, అభ్యాసన దీపికల పంపిణీ తదితర అంశాలపై మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, తొలిమెట్టు నోడల్ అధికారులతో ఐడీవోసీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చేపట్టిన తొలి మెట్టు కార్యక్రమంలో సూచించిన స్వల్పకాలిక లక్ష్యాలను ప్రతి ఒక విద్యార్థీ సాధించేలా కార్యాచరణ చేయాలని ఆదేశించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అదనపు తరగతులు తీసుకొని వారి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. తరగతి గదిలో సంభాషణ ఇంగ్లిషులోనే చేయాలని, దీంతో పిల్లలకు ఇంగ్లిషులో మాట్లాడడం సులువుగా వస్తుందని అన్నారు. ‘మన ఊరు – మన బడి’ కింద పూర్తయిన పనులకు నిధులు విడుదల అయ్యాయని, పాఠశాల నిర్వహణ కమిటీలకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులు పూర్తయిన పాఠశాలల్లో పెయింటింగ్ పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని సూచించారు. ఈ సంవత్సరం కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ చేయాలన్నారు.
ఫలితాల్లో వెనుకబడిన పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సందర్శనలు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభ్యాస దీపికల పంపిణీ వంద శాతం చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు. క్రీడా గ్రాంట్ పాఠశాలలకు మంజూరైనందున విద్యార్థుల ఆసక్తిని బట్టి క్రీడాపరికరాల కొనుగోలు చేయాలని సూచించారు. క్రీడా గ్రాంటును ఇతర అవసరాలకు వినియోగించొద్దని సూచించారు. పాఠశాలల్లో యాన్యువల్ డే, హాస్టళ్లలో హాస్టల్ డే నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అదనపు పాఠ్య ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో సోమశేఖరశర్మ, ఈఈ నాగశేషు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.