మధిర రూరల్, మార్చి 21 ; కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ గ్రామ సమీపంలో మధిర – వైరా రోడ్డులో ఉన్న సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్న మిర్చి బస్తాలకు మంటలు అంటుకోవడంతో ఒకసారిగా అవి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన మంటలను ఆర్పే ప్రక్రియను మొదలుపెట్టారు.
అగ్నికి ఆహుతైన సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీలో సుమారు 300 మంది రైతులకు సంబంధించిన రూ.25 కోట్ల విలువైన 28 వేల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ కోల్డ్ స్టోరేజీలో ఏపీలోని గంపలగూడెం, తెలంగాణలోని బోనకల్లు, మధిర మండలాల రైతులు తమ మిర్చి బస్తాలను నిల్వ ఉంచారు. తమ కష్టార్జితమంతా బుగ్గిపాలు కావడంతో కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా, ఫైర్ సిబ్బంది మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అవి అదుపులోకి వచ్చే అవకాశం లేదని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి స్థానికులెవరినీ ఆ ప్రాంతంలోకి వెళ్లనీయడం లేదు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా, సాయంత్రం ఐదు గంటల నుంచి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతున్నా కేవలం ఒక ఫైర్ ఇంజిన్ ద్వారానే మంటలను ఆర్పుతుండడంతో ఫలితం కన్పించడంలేదని రైతులు అధికారులపై మండిపడుతున్నారు. మధిర, వైరాతోపాటు మరో ఫైర్ ఇంజిన్‌ను తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని ఫైర్ సిబ్బంది అంటున్నారు. ఈ క్రమంలో స్థానిక సీఐ రమేశ్‌పై బాధిత రైతులు ఆవేదనతో వాగ్వాదానికి దిగారు. 15 ఏళ్ల క్రితం దెందుకూరు సమీపంలో వల్లభ కోల్డ్ స్టోరేజీలోనూ ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగిందని, అక్కడ కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేస్తున్నారు.