ఖమ్మం రూరల్, నవంబర్ 12: భారత పత్తి సంస్థ (సీసీఐ) ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సూచించారు. తల్లంపాడు సాయిబాలాజీ, పొన్నెకల్ జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ పీ.రవికుమార్, వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం ఆమె తనిఖీ చేశారు. సెంటర్ల వద్ద కంప్యూటర్లలో నమోదైన రైతుల వివరాలు, కపార్ కిసాన్ యాప్ వినియోగం తదితర అంశాలను ఆమె పరిశీలించారు. ఆయా కేంద్రాలకు పంటను తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం లక్ష్మీబాయి మాట్లాడుతూ.. పత్తి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. కౌలు రైతులు సైతం సీసీఐ కేంద్రాల్లో పంటను విక్రయించుకోవచ్చన్నారు. రైతు వేదిక వద్ద ఏఈవోలతో ధ్రువీకరించిన తర్వాత యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు పత్తి పంట 12 శాతం లోపు తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మద్దులపల్లి ఏఎంసీ సెక్రటరీ వీరాంజనేయులు, సీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.