ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 27 : ఎర్ర బంగారం(తేజా మిర్చి)తో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పోటెత్తింది. మేడారం జాతర తర్వాత పంట రాక తగ్గుతుందని అధికారులు, వ్యాపారులు భావించినప్పటికీ అంచనాలకు మించి వివిధ జిల్లాల నుంచి రైతులు భారీగా సరుకును విక్రయానికి తరలించారు. రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున వందలాది వాహనాల్లో వేలాదిగా బస్తాలు వస్తున్నప్పటికీ మార్కెట్ సిబ్బంది సరైన రీతిలో చర్యలు చేపట్టకపోవడంతో మార్కెట్ వెలుపల ఉన్న ప్రధాన వీధులు క్రయవిక్రయాలకు అడ్డాగా మారుతున్నాయి. ఉదయం జెండాపాట సమయానికి జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల నుంచి దాదాపు 60 వేలకు పైగా బస్తాలను మార్కెట్కు విక్రయానికి తీసుకొచ్చారు.
అయితే ప్రధాన యార్డులో సోమవారం రైతులు తీసుకొచ్చిన బస్తాల తోలకం పూర్తి కాలేదు. దీంతో అధికారులు అపరాలు, పత్తి యార్డుకు మిర్చి వాహనాలను తరలించారు. రెండు యార్డులు నిండిపోవడంతో ఆ తర్వాత రైతులు తీసుకొచ్చిన వేలాది బస్తాలను నడిరోడ్లపైనే దిగుమతి చేయాల్సి వచ్చింది. జెండాపాటలో క్వింటా గరిష్ఠ ధర రూ.21,400 పలికినప్పటికీ క్రయవిక్రయాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. కాగా.. కొద్ది రోజుల నుంచి ఇష్టారీతిన బస్తాలు దిగుమతి కావడంతో కొనుగోలు చేసిన బస్తాలు మాయమవుతున్నాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే 35 బస్తాలు మాయమయ్యాయని ఓ మిర్చి ఖరీదుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా మార్కెట్ అధికారులు రాత్రిపూట వచ్చే వాహనాలను నియంత్రించకపోతే మార్కెట్ వీధులే క్రయవిక్రయాలకు అడ్డాగా మారే అవకాశం ఉంది.