ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. గురువారం మధిరలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ఏరియాల్లో ఎండ వేడిమి తాళలేక ప్రజలు బయటకు రాకపోవడంతో రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగమూ పెరిగింది.
ఖమ్మం, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : మార్చి నెల సగంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో ఉండే ఎండలు ఇప్పుడు మార్చిలోనే దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత బయటకు వస్తున్నారు. మిగతా సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. గతేడాది మార్చి నెలతో పోల్చితే ఈ ఏడాది ఇదే నెలలో ఎండలు మండిపోతున్నాయి. గతేడాది మార్చి 17 వరకు 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈసారి ఇదే రోజు సగటున 37 డిగ్రీలు నమోదైంది. గురువారం అత్యధికంగా మధిరలో 42 డిగ్రీలు, రుద్రంపూర్‌లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్లేవారు తెల్లవారుజామున పనికి వెళ్తున్నారు. ఉపాధి పనికి కూడా ఉదయాన్నే వెళ్తున్నారు. పేద, మధ్యతరగి ప్రజలు అటకెక్కించిన కూలర్లను కిందికి దించుతున్నారు. కొందరు కూలర్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. మధ్యాహ్నం కూల్‌డ్రింక్ షాపులు, చెరుకురసం, పళ్ల రసాలు, కొబ్బరి బోండాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తున్నది. ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. ఎండకు తాళలేక చిరువ్యాపారులు మధ్యాహ్నం కాకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మణుగూరు ఏరియాల్లోని సింగరేణి ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే ఎండలు మండిపోతుంటే ఇక వచ్చే నెలలో ఎలా ఉంటాయోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మైన్స్‌లో అడుగుపెట్టాలంటేనే కార్మికులు జంకుతున్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నది. గురువారం నుంచి ఓసీల వద్ద చల్లటి నీరు ఏర్పాటు చేస్తున్నది. కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నది.
ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేవు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీయడం, వాగులపై వీలైన ప్రతి చోట చెక్ డ్యాంలు నిర్మించడంతో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతుండడంతో ప్రజలకు తాగునీటి కష్టాలూ తప్పాయి.
వేసవిలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా నీరు తాగాలి. ముఖ్యంగా బీపీ, మధుమేహ బాధితులు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు ఆరులీటర్ల నీరు తాగాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండతీవ్రత ఉన్నప్పుడు బయటకు రాకూడదు. డీహైడ్రేషన్, విరేచనాలు అయితే నీటిలో ఓఆర్ఎస్ పొడి కలిపి తాగాలి. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 15 నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పదోతరగతి విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, కోచింగ్ సెంటర్లకు వెళ్లే వారు ఎండలను సైతం లెక్కచేయకుండా తరగతులకు హాజరవుతున్నారు. సాధారణంగా రోహిణి కార్తెలో ప్రచండ ఎండ కాస్తుందని పెద్దలంటారు. కానీ ఈసారి ఆ కార్తె ముందే వచ్చిందా.. అన్నట్లు ఎండ తీవ్రత పెరిగింది. ఖమ్మం నగరంలో మధ్యాహ్నం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండతీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు కొందరు దాతలు ప్రధాన రహదారుల పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
వేసవిని దృష్ట్యా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఉచితంగా వాటిని పొందవచ్చు. వేసవిలో బయట పనిచేసేవారు వేసవిలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దవ్ర పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు రావాలి.
– డాక్టర్ నాగేంద్రప్రసాద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, కొత్తగూడెం