అశ్వారావుపేట, జూలై 27 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖంచాటేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఎవరితో సమావేశాలు నిర్వహించాలన్న కనీస ప్రొటోకాల్ లేకుండానే సర్క్యులర్ జారీ చేయటం పట్ల మండల అధికారులు అమోమయంలో పడ్డారు. దీనిపై తర్జనభర్జనలు పడిన తర్వాత జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో మండల ప్రత్యేకాధికారుల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించాలని మండల పరిషత్ అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో మంగళవారం సమావేశాలు జరగనున్నాయి.
భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల నిర్వహణకు మోక్షం లభించింది. ఇక నుంచి ప్రతి 45 రోజులకు ఒకసారి విధిగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తదనుగుణంగా జిల్లా యంత్రాంగం సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో మండల ప్రత్యేకాధికారుల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం జిల్లాలోని మంత్రులు, రాజ్యసభ ఎంపీలు, పార్లమెంట్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏఎంసీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్లు సమావేశాల్లో పాల్గొనాలి. కానీ, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో కేవలం సర్పంచులు, మండల అధికారులు అని మాత్రమే పేర్కొన్నారు. దీంతో సమావేశాలు నిర్వహించనున్న అధికారుల్లో అయోమయం నెలకొంది.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి మూడునెలలకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు జరిగేవి. ఎంపీపీల అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డివిజన్, మండల అధికారులు హాజరై మండలంలో ప్రగతిని వివరించేవారు. ప్రజాప్రతినిధులు కూడా స్థానిక సమస్యలను సమావేశాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార చర్యలు లభించేవి.
అయితే పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూన్‌తో ముగియడంతో అప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటాన్ని గమనించిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఎన్నికలు నిర్వహించకుండా దాటవేసింది. ఎంపీపీల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం సర్వసభ్య సమావేశాల నిర్వహణపై స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో సమస్యలను సమావేశ వేదికగా చర్చించే అవకాశం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు దక్కలేదు. మండల పరిషత్ పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో కార్యదర్శులు తప్ప ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఇటీవల ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చాలామంది కొత్తవారే ఉన్నారు. స్థానిక సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
రెండేళ్ల తాత్సారం తర్వాత ప్రభుత్వం మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో సర్పంచులు స్థానిక సమస్యల పరిష్కారం కోసం గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. సర్పంచులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల డివిజన్, మండల అధికారులు సమావేశాలకు హాజరుకానున్నారు. జిల్లాలో మంగళవారం మండలాల వారీగా సమావేశాలు నిర్వహించే సమయం వివరాలను జడ్పీ సీఈవో నాగలక్ష్మి ఖరారు చేశారు. అన్నపురెడ్డిల్లి, భద్రాచలం, చర్ల, చుంచుపల్లి, దమ్మపేట, గుండాల, జూలూరుపాడు, కరకగూడెం, మణుగూరు, ములకలపల్లి, ఇల్లెందు మండలాల్లో సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఆళ్ళపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, చండ్రుగొండ, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, పినపాక, సుజాతనగర్, టేకులపల్లి మండలాల సమావేశాలు మధ్యాహ్నం 2 గంటలకు, అశ్వారావుపేటలో బుధవారం ఉదయం 11 గంటలకు మొదలుకానున్నాయి.