నాడు..
చెట్ల కింద పాఠాలు.. అరకొర వసతులు.. తాగేందుకు నీరు లేదు.. తినేందుకు సరైన భోజనం లేదు.. కూర్చునేందుకు బల్లలు లేవు.. మాసిపోయిన బ్లాక్‌బోర్డులు.. కుంగిపో యిన ఫ్లోరింగ్.. విద్యుత్ సౌకర్యం లేదు.. చీకటిలోనే విద్యాబోధన.. ఇదీ గత పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి..
నేడు..
స్వరాష్ట్రంలో చదువుపై ఆసక్తి పెరిగింది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడ్డాయి.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు/మన బస్తీ – మన బడి’ పథకంతో సర్కారు పాఠశాలల రూపురేఖలు మారాయి.. అత్యాధునిక బెంచీలు, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు.. విద్యుత్ వెలుగులు.. ఫ్యాన్లు.. గ్రంథాలయాలు.. తాగునీరు, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. క్రీడా స్థలాలు, ఉద్యాన వనాలను తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచే ప్రాంగణాలు, చదువుపై ఆసక్తిని పెంచేలా గోడలపై పెయింటింగ్‌లతో ప్రభుత్వ బడులను భళా అనేలా తీర్చిదిద్దారు. కళ్లు చెదిరేలా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 14 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తి కాగా 63 పాఠశాలల్లో చివరి దశలో పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : విరిగిపోయిన చెక్క బల్లలు.. వెలిసిపోయిన బ్లాక్‌బోర్డులు.. కుంగిపోయిన ఫ్లోరింగ్.. విద్యుత్ వసతిలేక చీకటితో నిండిన గదులు.. ఇదీ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి భిన్నంగా మారింది. మన ఊరు/మన బస్తీ-మన బడి పథకంతో సర్కార్ స్కూల్స్ దశ, దిశ తిరిగింది. అత్యాధునిక బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డులు, విద్యుత్ దీపాల వెలుగులు, ఉద్యాన వనాలను తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచే ప్రాంగణాలు, చదువుపై ఆసక్తిని పెంచేలా పెయింటింగ్‌లతో కూడిన ప్రహరీలతో ప్రభుత్వ బడులను భళా అనేలా తీర్చిదిద్దారు. కళ్లు చెదిరేలా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు అత్యాధునిక విద్యను అందించేందుకు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
సరికొత్త హంగులు…
ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి బాటన వడివడిగా పరుగులు తీస్తున్నాయి. ప్రభుత్వ బడుల దిశ, దశ మార్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు/మన బస్తీ-మన బడి పథకంతో సరికొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. సర్కార్ బడులు ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. ఒక్క సమస్య కూడా ఉత్పన్నం కాకుండా అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధునికీకరణ, మౌలిక వసతులు, నీటి వసతితో కూడిన అత్యాధునిక టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కార్పొరేట్ స్కూల్స్‌కే పరిమితమైన అత్యాధునిక ప్రమాణాలతో కూడిన పరికరాలను ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో తెచ్చారు.
63 స్కూల్స్‌లో చివరిదశలో పనులు..
ఖమ్మం జిల్లాలో 426 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు/మన బస్తీ-మన బడి పథకం మొదటి విడత ద్వారా గుర్తించి వీటిలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నది. జిల్లాలోని ఏడు ప్రభుత్వశాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారుల నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చివరి దశకు చేరుకున్నది. వీటిలో 14 స్కూల్స్‌లో వంద శాతం పనులు పూర్తి కాగా, 63 స్కూల్స్‌లో పనులు చివరి దశలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి వారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష జరుపుతుండడంతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.
14 స్కూల్స్‌లో వందశాతం పనులు పూర్తి
మన ఊరు – మన బడి/మన బస్తీ పథకం కింద ఎంపికైన స్కూల్స్‌లో 12అంశాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చరాత బోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన తరగతి గదులు, భోజన శాల, డిజిటల్ సౌకర్యాలను సమకూర్చి జిల్లాలో 14 స్కూల్స్‌లో వంద శాతం పనులు పూర్తి చేశారు.