Khammam | కారేపల్లి, జూన్ 27 : రైతన్నలకు మరింత సేవలు అందించేందుకు మన గ్రోమోర్ (కోరామండల్) స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ తెలంగాణ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మన గ్రోమోర్ బ్రాంచ్ని వర్చువల్ ద్వారా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి కావలసిన అన్ని రకాల సేవలను మన గ్రోమోర్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు కోరమండల్ గ్రోమోర్ దుకాణలలో లభిస్తాయన్నారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గ్రోమోర్ కేంద్రాలను నూతనంగా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు తమ పంటలకు మందులను పిచికారి చేసేందుకు కూడా ఎకరాకు రూ 400 చొప్పున చార్జితో డ్రోన్ పరికరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా 30 కిలోమీటర్ల పరిధిలోపు గ్రోమోర్ లలో కొన్న వస్తువులను ఉచితంగా సరఫరా చేసే వీలును కల్పించడం జరిగిందన్నారు. రైతులు భూసార పరీక్షలు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పురోహితులు సురేంద్ర శర్మ వలివేటి, విశ్వనాధ మహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి నూతన కేంద్రాన్ని స్థానిక రైతు తాతా వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భవన యజమాని హనుమకొండ రమేష్, ఏరియా రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్, స్టోర్ మేనేజర్ మహేష్, ఆర్ఎసి జనార్ధన్, రైతులు, స్థానిక వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.