
వారంతా కూసుమంచి
ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. వారిలో మనందరికీ తెలిసిన వారూ ఉన్నారు. వారే డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. వీరే కాదు ఇంకా ఎంతో మంది ఇస్రో సైంటిస్ట్‌లుగా, పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకున్నారు. చదివింది తెలుగు మీడియంలో అయినప్పటికీ కష్టపడి ఇంగ్లిష్ నేర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు.
కూసుమంచి, జనవరి 30: వారంతా కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. వారిలో మనందరికీ తెలిసిన వారూ ఉన్నారు. వారే డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. వీరే కాదు ఇంకా ఎంతో మంది ఇస్రో సైంటిస్ట్‌లుగా, పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకున్నారు. చదివింది తెలుగు మీడియంలో అయినప్పటికీ కష్టపడి ఇంగ్లిష్ నేర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. వారి అభిప్రాయాల మాలికతో కథనం.
సమూల మార్పులు..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యా విధానంలోనూ మార్పులు తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు రాణించాలంటే వారికి ఆంగ్లంపై పట్టు తప్పనిసరిగా ఉండాలని సంకల్పించిన కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేసింది. దాంతోపాటు సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులకూ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘మన ఊరు మన బడి’ని అమలు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతుండడంతో ఇది వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు తరువాత ఉన్నత స్థానాలను అధిరోహించారు. ప్రతిభ ఉన్న పేద వ విద్యార్థులకు మరింత మేలు కలుగనుంది. ఆర్థిక స్తోమత లేకపోవడం వంటి కారణాల వల్ల పేద విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికి దూరమయ్యే ప్రమాదాలు తప్పిపోనున్నాయి.
మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం..
సర్కారు బడులంటే సమస్యలకు నిలయమనే నానుండి ఉండేది. ఇక నుంచి అలాంటి నానుళ్లకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడుతోంది. గురుకులాలు, ఉచిత విద్య వంటి వాటితోపాటు ఇది వరకు తీసుకున్న చర్యల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక నుంచి ఈ సంఖ్య మరింత పెరగనుంది. జిల్లాలోని స్కూళ్లలో నిరుట కంటే ఈ సంవత్సరం 20 వేల మంది విద్యార్థులు పెరిగిన విషయం విదితమే.
ఇంగ్లిష్ బోధన ఎంతో అవసరం..
మారుతున్న సమాజంలో ఇంగ్లిష్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్య, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇంగ్లిష్ వచ్చి తీర్చాల్సిందే. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తాననడం శుభపరిణామం. నేను కూసుమంచి ప్రభుత్వ హైస్కూలులో 2003- 08 వరకు చదువుకున్నా. 2019లో ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాను. ప్రస్తుతం తిరువనంతపురంలోని ఇస్రోలో ఎల్పీఎస్సీ సైంటిస్టుగా పని చేస్తున్నా. మాది కూసుమంచి మండలం గోరీలపాడు తండా. ప్రతి స్కూలులో ఇంగ్లిష్ మీడియం వస్తే ఇంకా ఎంతో మంది నాణ్యమైన విద్య అందుకుంటారు.
-బానోత్ గణేశ్, ఇస్రో సైంటిస్ట్, కూసుమంచి
5 ఎకరాల స్థలాన్ని వితరణ చేశాం..
గ్రామంలో పాఠశాల ఉండాలనే ఆలోచనతో మా తాత గారు రంగుభట్ల అప్పయ్య, రామసహాయం రామకృష్ణారెడ్డి కలిసి 1957లో ఐదు ఎకరాల స్థలాన్ని వితరణగా ఇచ్చారు. నేడు ఆ స్థలానికి రూ.కోట్ల విలువ ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సర్కారు బళ్లను బలోపేతం చేస్తోంది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంతో పేద విద్యార్థులకు చక్కనైన విద్యాబోధన అందుతోంది. ఇకనుంచి ఇంగ్లిష్ మీడియాన్ని తప్పినిసరి చేస్తే పేద విద్యార్థులకు మంచి రోజులు వచ్చినట్టే.
-రంగుభట్ల హేమసుందర శాస్త్రి, పూర్వ విద్యార్థి, విశ్రాంత జైలర్
ఇంగ్లిష్ మీడియం పేద విద్యార్థులకు వరం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. పేద విద్యార్థులను చదువులో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనతోపాటు మౌలిక వనరుల కోసం రూ.7,279 కోట్లు ఖర్చు చేస్తుండడం సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన అంశం. 1983-84లో నేను కూసుమంచి పాఠశాలలో చదువుకునే రోజుల్లో కనీస వసతులు లేవు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సకల వసతులూ కల్పించింది.
-సండ్ర వెంకటవీరయ్య,ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి, సత్తుపల్లి ఎమ్మెల్యే
ఇంగ్లిష్ బోధన తప్పనిసరి..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశ పెట్టడం చాలామంచి విషయం. ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ఆంగ్ల భాష ఎంతో అవసరమవుతోంది. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనుండడం గొప్ప పరిణామం. గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం లేక అవస్థలు పడుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. నేను కూసుమంచి స్కూల్లో 2015లో టెన్త్ చదివాను.
-నందిపాటి భరత్, పూర్వ విద్యార్థి, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ