కూసుమంచి, మార్చి 21: సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్‌లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో హైదరాబాద్ ఎస్బీఐలో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయడం, విచారణలో భాగంగా సదరు దరఖాస్తుదారుడు తప్పుడు వివరాలు అందించాడని బ్యాంకు గుర్తించడం వంటి పరిణామాలు కూసుమంచిలో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ‘పీఎం కిసాన్’ పేరిట కొందరు సైబర్ నేరగాళ్లు కూసుమంచి రైతు ఖాతా నుంచి రూ.3.4 లక్షలను కాజేసి వారం రోజులు గడవక ముందే.. తాజా మోసం కూడా వెలుగులోకి రావడం గమనార్హం.
జంగం బాలరాజు అనే వ్యక్తి తాను కూసుమంచి తహసీల్దార్నని పేర్కొంటూ ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ డిపార్ట్మెంట్’ పేరిట తప్పుడు గుర్తింపు కార్డు సృష్టించుకున్నాడు. దానిపై ఏకంగా కలెక్టర్ సంతకం, స్టాంపు కూడా ముద్రించుకున్నాడు. ‘తండ్రి: చంద్రమౌళి, తహసీల్దార్ ఎంప్లాయి ఐడీ: 2025192, కూసుమంచి’ పేరిట ఐడెంటిటీ కార్డు తయారు చేసుకున్నాడు. ఈ వివరాలతో కూడిన దరఖాస్తును తన మనిషికి ఇచ్చి హైదరాబాద్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) జూబ్లీపుర బ్రాంచ్ అధికారుల వద్దకు పంపాడు. ‘మా సార్ కూసుమంచిలో తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు పంపారు’ అని చెప్పి ఆ దరఖాస్తును అక్కడి అధికారులకు అందించాడు.
తరువాత దరఖాస్తు పరిశీలనలో భాగంగా ఎస్బీఐ జూబ్లీపుర బ్రాంచ్ అధికారులు ఎస్బీఐ కూసుమంచి బ్రాంచ్ మేనేజర్ సురేందర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. కూసుమంచి ఎస్బీఐ మేనేజర్ వెంటనే స్థానిక తహసీల్దార్ కార్యాలయ అధికారులను వాకబు చేశారు. ప్రస్తుత తహసీల్దార్ కరుణశ్రీ అని, జంగం బాలరాజు పేరిట గతంలోనూ ఇక్కడ ఎవరూ పనిచేయాలని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని జూబ్లీపుర బ్రాంచ్ అధికారులకు తెలియజేశారు. దీనిపై జూబ్లీపుర బ్రాంచ్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కరుణశ్రీ, ఎస్బీఐ మేనేజర్ సురేందర్‌లను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. జంగం బాలరాజు పేరిట ఇప్పుడుగానీ, ఇంతకుమునుపుగానీ ఇక్కడ ఎవరూ పనిచేయలేదని స్పష్టం చేశారు.