– రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు
ఖమ్మం రూరల్, మార్చి 28 : ఖమ్మం రూరల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి నండ్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీఓ శ్రీదేవికి అందజేశారు. రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి మామిండ్ల మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా పండించారని, పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వెళితే దళారీ చేతిలో మోసపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలన్నారు.
అకాల వర్షాలు పడుతున్నా, రైతులు పండించిన పంటలు తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంఘాలకతీతంగా రైతులను సేకరించి ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వడ్లమూడి నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు చావా నాగేశ్వరరావు, జక్కంపూడి నాగేశ్వరరావు, ఏటుకూరి ప్రసాదరావు, రెంటాల నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి నాయకుడు నందిగామ కృష్ణ, గిరిజన సంఘం నాయకులు భూక్య నాగేశ్వరరావు, నందిపాటి లక్ష్మయ్య, కష్టాల ఆంటోని పాల్గొన్నారు.