తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీకి కక్షగట్టింది. కర్షకుల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ఓర్వలేకపోతున్నది. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో చేపలు ఆరబెట్టుకునేందుకు కల్లాలు నిర్మిస్తుంటే అభ్యంతరం చెప్పని మోదీ సర్కారు.. తెలంగాణ రైతులు పంట కల్లాలు నిర్మించుకుంటే అడ్డుకుంటున్నది.
రైతులకు అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం భద్రాద్రి, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టేందుకు బీఆర్ఎస్శ్రేణులు సన్నద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల బాధ్యులు, అన్నదాతలు భారీగా తరలిరానున్నారు.
-ఖమ్మం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణప్రతినిధి)
ఖమ్మం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణప్రతినిధి) : రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శుక్రవారం మహాధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు ఉపయుక్తమయ్యే పంట కల్లాల నిర్మాణాన్ని కేంద్రం అడ్డుకుంటుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాత కోసం కల్లాలు నిర్మిస్తే మోదీ సర్కారు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నది. దీంతో రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీసర్కార్ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ నేడు భద్రాద్రి, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించనున్నది.
ఈ ధర్నాకు రైతులంతా తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగే ధర్నాకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, జడ్పీచైర్మన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ ఎదురుగా ధర్నాచౌక్‌లో ధర్నా ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల బాధ్యులు, అన్నదాతలు భారీగా తరలొచ్చి బీజేపీ సర్కార్ తీరును ఎండగట్టాలన్నారు.
భద్రాద్రి జిల్లాలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
పంట కల్లాలపై కేంద్రం పగ!
పంట పొలాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతేడాది నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయశాఖ అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించి కల్లాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది రైతులు కల్లాలను నిర్మించుకున్నారు. మరికొందరు కల్లాలు నిర్మించుకుని డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం రైతులకు అన్యాయం చేసేలా మరో నిర్ణయం తీసుకున్నది. రైతు కల్లాల కోసం వెచ్చించిన నిధులను తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు.
పంటను ఆరబెట్టుకునేందుకే కల్లాలు
గతంలో రహదారులపై పంటను ఆరబెట్టుకునేది. దీంతో ప్రమాదాలు జరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రైతు కల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. దీనిద్వారా పంట పొలాల్లోనే కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం నిధులు కేటాయించింది. 50 మీటర్ల కల్లానికి రూ.56 వేలు, 60 మీటర్ల కల్లానికి రూ.68 వేలు, 75 మీటర్ల కల్లానికి రూ.85 వేలను మంజూరు చేసింది. ఇందులో రైతు వాటా 10శాతం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో వందలాది మంది రైతులు కల్లాలను నిర్మించుకున్నారు.
తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని కేంద్రం అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పంట కల్లాలను కడితే కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని నిలదీశారు. రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉందని దుయ్యబట్టారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్షకట్టిందని రైతు సంఘాల నాయకులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ధర్నాకు మద్దతుగా ఉంటామని వారు పేర్కొన్నారు.
ఇదీ కర్షకులకు ప్రయోజనం
ఖమ్మం జిల్లాలో 3,599 కల్లాలు మంజూరయ్యాయి. వీటిలో 742 పూర్తయ్యాయి. మరో 1,077 నిర్మాణ దశలో ఉన్నాయి. నేటి వరకు ప్రభుత్వం రూ.50.63 కోట్లు చేయగా.. రూ.46.11 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ.4.51కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. కల్లాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు తమ సొంత భూముల్లోనే మిర్చి, పత్తి, ధాన్యం, పెసర వంటి పంటలను ఆరబెట్టుకునే అవకాశం ఉంటుంది. తద్వారా పంటలో తేమశాతం తగ్గించుకోవడంతో మార్కెట్లో మంచి ధర పొందవచ్చు. కర్షకులకు ఉపయోగపడే కల్లాల నిధులను వెనక్కి ఇవ్వాలని బీజేపీ సర్కార్ జీవో జారీ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.