చింతకాని, మే 30: విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మధిర ఏడీఏ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆయన గురువారం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో సమావేశమయ్యారు. స్టాక్ రిజిస్టర్, విత్తణ ప్యాకెట్ల నాణ్యత, గడువు తేదీ తదితరాలను దుకాణాదారులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఎరువుల దుకాణం ముందు స్టాక్ బోర్డు, దరల పట్టిక ఉంచాలని చెప్పారు.
రైతులకు విధిగా రసీదులు ఇవ్వాలన్నారు. వీటిపై కొనుగోలుదారు సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే రైతులకు కాంప్లెక్స్, యూరియా వంటి ఎరువులను అందించాలని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, షాపు లైసన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను అమ్మకూడదని చెప్పారు. ఏవో పల్లెల నాగయ్య, ఎస్సై షేక్ నాగుల్‌మీరా, ఏఈవోలు రాము, హరికృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సత్తుపల్లి, మే 30: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తుపల్లి వ్యవసాయ సహాయ సంచాలకుడు యు.నర్సింహారావు హెచ్చరించారు. మండలంలోని కొత్తూరు రైతు వేదికలో ఆయన గురువారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో సమావేశమయ్యారు. విత్తన డీలర్లు రిజిస్టర్లను నిర్వహించాలని, క్రయ-విక్రయ నివేదికలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. ఇన్ వాయిస్‌లు,, బిల్లులు లేకుండా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణం పేరు, డోర్ నంబర్లు స్పష్టంగా కనిపించాలన్నారు. సీఐ కిరణ్, ఏవో వై.శ్రీనివాసరావు, ఏఈవో నరేష్ పాల్గొన్నారు.
కూసుమంచి,మే 30: ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఊరుకునేది లేదని, చర్యలు ఉంటాని వ్యవసాయ శాఖ అధికారి ఆర్ వాణి హెచ్చరించారు. మండలంలోని కోక్యాతండా,చౌటపల్లి, పాలేరులోని విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. తప్పనిసరిగా రిజిస్టర్లు నిర్వహించాలన్నారు.
మధిర, మే 30: జీలుగు విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు మధిర వ్యవసాయాధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 1200 క్వింటాళ్ల జీలుగు విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
బోనకల్లు, మే 30: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని కోరుతూ మండల వ్యవసాయాధికారి సరితకు సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఎం.గిరి, పెద్దపోలు వెంకటేశ్వర్లు, జక్కా మోహన్‌రావు, పులుసు రవి, సీహెచ్ వీరబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.