చండ్రుగొండ, ఏప్రిల్ 22: నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులకే మంజూరు చేశారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన నిరుపేదలు రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, మహిళలు మాట్లాడుతూ గ్రామంలో 42 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే.. అందులో అనర్హులనే ఎక్కువగా ఎంపిక చేశారన్నారు.
జాబితాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇళ్లు లేని నిరుపేదలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఇందిరమ్మ కమిటీలు కూడా తమకు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులమైన తమకు ఇళ్లు మంజూరు చేయకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాయల దుర్గ, రాజమ్మ, పద్దం జయ, చెందిలి మరియమ్మ, కాంపాటి మౌనిక, సునీత, విజయలక్ష్మి, కవిత, శారద, నాగమణి తదితరులు పాల్గొన్నారు.