కారేపల్లి, ఫిబ్రవరి 18: మొదటి నుండి ఆ విదయార్థి అదే పాఠశాలలో చదువుతున్నాడు. కానీ పదో తరగతి పరీక్షలు రాయడానికి పనికి రాడని చెప్పిన పాఠశాల యాజమాన్యం చెప్పిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది.నెలనెలా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.. నాణ్యమైన విద్యాబోధనతోపాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన నేర్పడానికి బదులు తన కుమారుడు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం కష్టమని, వేరే పాఠశాల చూసుకోవాలని తల్లిదండ్రులకు విద్యాసంవత్సరం చివర్లో నోటీసులు జారీ చేసింది.
‘మీ పిల్లల ప్రవర్తన సరిగా లేదు. స్కూల్ పెద్దల పట్ల సరైన వినయం చూపటం లేదు. మీ పిల్లలను వేరే పాఠశాలకు మార్చుకోండి’ అని అంటూ పిల్లల తల్లిదండ్రులనుద్దేశించి కారేపల్లి పెట్రోల్‌బంక్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రతినిధి విద్యార్థుల డైరీలలో రాసి పిల్లలను, తల్లిదండ్రులను మానసిక ఆవేదనకు గురిచేస్తున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యకు చిరునామా అంటూ ప్రచారం చేసుకున్న ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని నిర్మల స్కూల్లో నలమాద వెంకట్ రాహుల్ నర్సరీ నుండి విద్యానభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రాహుల్ డెర్జీలో మంగళవారం పాఠశాల ప్రతినిధి..‘మీ బాబుకు పాఠశాల పట్ల గౌరవం లేదు. వచ్చే ఏడాది పదోతరగతికి వేరే పాఠశాల చూచుకోవాలి’ అంటూ రాశారు.
దీంతో ఆ విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లవాడికి అన్ని తరగతులలో మంచి మార్కులు వస్తున్నాయని, అయినా పాఠశాల సీనియర్ సిస్టర్ రాహుల్ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నర్సరీ నుండి విద్యాబుద్ధులు నేర్పిన ఆదే పాఠశాలలో పదోతరగతి చదివేందుకు తమ పిల్లవాడిలో లోపాలు ఉన్నాయంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని, తమను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న స్కూల్ యాజమాన్యంపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేయనున్నట్లు బాధిత విద్యార్థి తండ్రి రమేష్ తెలిపారు.