కూసుమంచి(నేలకొండపల్లి), జూన్ 22 : రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ జూలై మొదటి వారం నుంచి రుణమాఫీ ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. పేదవాడి కలలు తీర్చడం కోసం ఇందిరమ్మ రాజ్యం తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. అర్హులైన వారికి ఐదేళ్లలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో నేడు రాష్ట్ర మంత్రినయ్యానని గుర్తు చేశారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తానన్నారు. అనంతరం ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు అంజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్డీవో గణేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీరాం, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఎంపీపీ వజ్జా రమ్య, నాయకులు వెన్నెపూసల సీతారాములు, శాఖమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, దండా పుల్లయ్య, మామిడి వెంకన్న, వంగవీటి నాగేశ్వరరావు, బ్రహ్మ, యూత్ నాయకులు అంజి, సీపీఐ నాయకుడు బాగం హేమంతరావు పాల్గొన్నారు.