మధిర: తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ (Lingala Kamalraj) అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా పదేండ్లపాటు పరిపాలన చేశారని తెలిపారు. కేసీఆర్ సాధించిన రాష్ట్రంలో పదేండ్లపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. అబద్ధాలతో అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేస్తుందని విమర్శించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలంటూ మధిర నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో రోడ్లకు ఇరువైపులా గోడలకు వాల్ పెయింటింగ్‌లు రాస్తూ నాయకులు ప్రచారం చేస్తున్నారు. లింగాల కమల్‌రాజ్ స్వయంగా పెయింటింగ్ బ్రష్ పట్టి కేసీఆర్ జిందాబాద్, బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ రాశారు.
అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాధించిన తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం బీఆర్ఎస్ సభకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బుచ్చయ్య, నరేందర్ రెడ్డి, ఆళ్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.