మధిర మార్చి 7: మధిరలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. వెంటనే దవాఖాన ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం దవాఖాన గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ వంద పడక ఆసుపత్రి పూర్తై 15 నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించలేదన్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా వేళ ప్రజా వైద్య సౌకర్యం కోసం అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారన్నారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ దవాఖాన నిర్మాణం కోసం రూ.36 కోట్లు మంజూరు చేసి దవాఖాన నిర్మాణం పూర్తి చేశారన్నారు.
అభివృద్ధి పనుల కోసం రూ.కోట్ల నిధులు తీసుకొచ్చానని చెబుతున్నరాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పూర్తైన వంద పడకల ఆసుపత్రి, ఎక్సైజ్ కార్యాలయం, బంజారా భవన్ ప్రారంభానికి సమయం దొరకడం లేదా అని లింగాల కమల్‌రాజ్ ప్రశ్నించారు. ఈ ఆస్పత్రి అన్ని వసతులు వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా భట్టి విక్రమార్క వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిత్తార్ నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు బొగ్గుల భాస్కర్ రెడ్డి, కటికల సత్యనారాయణ రెడ్డి, అరగ శ్రీనివాసరావు, పరిష శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, యెన్నంశెట్టి అప్పారావు, చిదిరాల రాంబాబు, కొత్తపల్లి నరసింహారావు, ఎంవీఎస్ ప్రసాద్, కోటేశ్వరరావు, జయమ్మ, తాటికొండ వెంకటేశ్వర్లు, అమరవాది కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.