బోనకల్లు, మార్చి 27 : అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ 30 శాతం కమీషన్‌పై మాట్లాడిన మాటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఉలికిపాటు ఎందుకని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భట్టి విక్రమార్క శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి రాష్ట్రంలో కమీషన్ల పర్వం నడుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్న విషయాన్ని కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు. ఈ విషయంపై మల్లు భట్టి విక్రమార్క కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలను చేయడం దారుణమన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భట్టి విక్రమార్క భుజాలు తడుముకోవడం ఏంటనీ ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు ఆనాటి ప్రభుత్వం బిల్లులు చెల్లించిందన్నారు. కానీ విక్రమార్క మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలో చెల్లించని బిల్లుల వల్ల ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పెట్టిన ఖర్చులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. 200 మంది కాంట్రాక్టర్లు ఏకంగా బిల్లుల కోసం రాష్ట్ర సచివాలయంలో ధర్నా చేశారన్నారు. ఎవరైనా సరే కమీషన్ చెల్లిస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు కమీషన్ల చెల్లిస్తేనే బిల్లులు చెల్లిస్తున్న విషయం వాస్తవం కాదా? కేటీఆర్ పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. బిల్లుల కోసం ఉద్యమానికి సిద్ధమైన మాజీ సర్పంచులను రాత్రి వేళల్లో పోలీసులు అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మండిపడ్డారు.
అధికారం కోసం ప్రజలకు ఆరు గ్యారెంటీలను 90 రోజుల్లో అమలు చేస్తానని ఆశ చూపి అందలం ఎక్కిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఈ పథకాల్లో ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నాడు ప్రతి ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జిల్లాలో మొక్కజొన్న పంట పండించిన రైతు కోసం ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదని ప్రైవేట్ మార్కెట్ లోని అమ్ముకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేకపోతే ప్రజల తరఫున ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, మధిర శివాలయ కమిటీ మాజీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు పారా ప్రసాద్, రావినూతల మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, ఎస్టీ సెల్ అధ్యక్షుడు నునావత్ సైదా, భూక్య లక్కియా పాల్గొన్నారు.