బోనకల్లు, నవంబర్ 23: కాంగ్రెస్ పాలకులతో కర్షకులకు ప్రమాదం పొంచిందని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆ విషయం అన్నదాతలకు తెలుసు కాబట్టే వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంట నడుస్తున్నారని అన్నారు. దాన్ని ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్షకులను కేసీఆర్ నుంచి వేరు చేయాలని చూస్తున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కర్షకులు బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే ఉంటారని స్పష్టం చేశారు. బోనకల్లు మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. రాపల్లె గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వర్షంలో తడుస్తూనే ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణను జీర్ణించుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎంతలా తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. ధరణిని రద్దు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే భట్టివిక్రమార్క చెబుతున్నాడని, రైతులకు మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారని విమర్శించారు. వీరి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు, రైతులకు బాగా తెలుసునని స్పష్టం చేశారు. వీరికి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజల్లో ఒకరిగా ఉన్న తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చేబ్రోలు మల్లికార్జునరావు, ఏనుగు నాగేశ్వరరావు, పెనుగొండ ఏడుకొండలు, జెర్రిపోతుల రవీందర్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.