ముదిగొండ, జూలై 1: పాలనను గాలికొదిలేసి ప్రజా పాలన అంటూ ప్రజల నుంచి దరఖాస్తులు (అర్జీలు) తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, కానీ.. ఒక్కరికి కూడా పథకాలు అందించిన దాఖలాలు లేవని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. ముదిగొండతోపాటు న్యూలక్ష్మీపురం, గంధసిరి, పెద్దమండవ గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆయన పలువురు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. తర్వాత వెంకటాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
19 నెలల పాలనలో ఇళ్లు, రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం, భూ సమస్యల కోసం పలుమార్లు దరఖాస్తులు చేసుకుంటే దేనిని కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో గ్రామపంచాయతీలు ఎలా ఉన్నాయి? నేడు ఎలా ఉన్నాయి? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించని ఘనత వారిదన్నారు. హడావుడిగా రైతులకు రైతుభరోసా వేసేది ఎన్నికల కోసమేనని, ఇది ప్రతీ ఒక్కరికి తెలుసని అన్నారు. గురుకులాలను అధఃపాతాళానికి రేవంత్రెడ్డి సర్కార్ పడేసిందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు పరుగులు పెడుతున్న కాంగ్రెస్ నాయకులను ఊరూరా నిలదీయాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారన్న భయంతోనే రోజుకో విచారణను, కమిషన్ను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్నా కనీసం సమీక్షలు కూడా లేవని విమర్శించారు. జిల్లాలో సాగు పనులు ప్రారంభమైనా విత్తనాలు, ఎరువుల నిల్వలు లేవని అన్నారు. వరదలొస్తే పరిస్థితి ఏమిటనే దానిపై కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, ఓరుగంటి నాగేశ్వరరావు, ధర్మ, షేక్ ఖాజా, కోటి, అనంతరాములు, కొమ్మూరి రమేశ్, శ్రీను, కోడెబాబు, గురుమూర్తి, పోట్ల రవి తదితరులు పాల్గొన్నారు.