ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణామాలతో జ్వరాల విజృంభణ.. ఏ ఇంటిని పరిశీలించినా జ్వరపీడితులే దర్శనం.. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలన్నీ బాధితులతో కిటికిటలాడుతున్నాయి.. ఇటీవల కాలంలో వైరల్, డెంగ్యూ ఫీవర్స్‌తో అనేక మంది మృత్యువాత పడుతున్నారు.. వీరిలో ఎక్కువ మంది పేద, మధ్యతరగతికి చెందిన వర్గాలు కావడం గమనార్హం..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు.. ప్రజారోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర మందులు, వసతుల లేమి, వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ‘మార్పు’ తెచ్చిన ముప్పుతో ప్రాణాలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని జనాలు వాపోతున్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాలేకుండా రోజురోజుకూ జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందితో కలిసి ఒక్కరోజు 92,808 మందిని సర్వే చేయగా.. 440 పైచిలుకు మంది రకరకాల ఫీవర్స్ బారిన పడినట్లు తేలింది. వారిలో 408 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు కేవలం ఒక్క ఖమ్మం జిల్లాలోనే 155 డెంగ్యూ పాజిటివ్ కేసులున్నాయి.
ఈ ప్రకారం నెలకు దాదాపు 15 వేల మంది విషజ్వరాల బారిన పడుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదేక్రమంలో అనేక మంది మృత్యుఒడిలోకి జారుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం కావచ్చు వారి మరణాలను నిర్ధారించడంలో జిల్లా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నది. జ్వరం వచ్చినప్పటికీ సకాలంలో వారు ఆసుపత్రికి వెళ్లలేదని, క్షేత్రస్థాయిలోని తమ సిబ్బంది సూచనలను పట్టించుకోలేదని, ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారనే కోణంలో నివేదికలను రూపొందిస్తూ కాలయాపన చేస్తున్నది.
ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు జ్వర పీడితులతో కిట కిటలాడుతున్నాయి. రోజుకు వేలాది మంది వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన వైద్యసేవలు అందించి పేద, మధ్యతరగతి వర్గాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వాసుపత్రులు వసతుల లేమి కారణంగా నీరసించి పోయాయి. జ్వరాలను విశ్లేషించి తగిన మందులు సిఫారసు చేయాల్సిన వైద్యులు తగినంతమంది లేరు. అనేక ప్రాంతాల్లో సీనియర్ ఏఎన్ఎంలే పెద్దదిక్కుగా మారడటంతో విషజ్వరాలు అదుపులోకి రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నామమాత్రపు వైద్య పరీక్షలు, ఒకటీ రెండురకాల మందు గోలీలు ఇచ్చి వైద్యారోగ్యశాఖ యంత్రాంగం చేతులు దులుపుకోవడంతో మరణాలు కూడా సంభవిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకుందామనే తాపత్రయంతో ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కుతున్న రోగులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జ్వరం వచ్చిందని వెళ్లిన వ్యక్తికి తొలుత రకరకాల రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు, మందులు అన్నీ కలిపితే రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చవుతోంది. ప్లేట్లెట్స్ తగ్గి ఇన్‌పేషెంట్‌గా చేరిన వారు కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సిందే. ఇదంతా భరించలేని నిరుపేదల జీవితాలు గాలిలో దీపంలా మారాయి.
రెండు జిల్లాల్లో విషజ్వరాల సీజన్ కొనసాగుతోంది. దీనికి పారిశుధ్య లోపమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం జిల్లాలో 586, భద్రాద్రి కొత్తగూడెంలో 471 గ్రామ పంచాయతీలున్నాయి. తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు కావస్తున్నది. పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కారణంగా పరిస్థితులు అదుపు తప్పాయనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు రాక, కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు మంజూరు కానందున బ్లీచింగ్, క్లోరినేషన్‌కు ఉపయోగించే రసాయనాలు, ఫాగింగ్ చేయడానికి పైసల్లేవు. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రాక్టర్స్‌కు డీజిల్ కూడా పోయించలేక, వాటిని మూలన పడేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారి దోమలకు ఆవాసాలుగా మారాయి. వాటి బారిన పడుతున్న జనం జ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు పట్టణాలకు ప్రత్యేక నిధులివ్వగా.. నేటి కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా కనీసం దృష్టి సారించిన పాపానపోవడం లేదు.
ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్స్, 161 పల్లె దవాఖానలు, మరో 9 బస్తీ దవాఖానలు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, మధిర, వైరా, సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి, కల్లూరు వైద్యశాలలున్నాయి. వీటన్నింటికి పెద్ద దిక్కుగా జిల్లా సార్వజనీన ఆసుపత్రి ఉంది. ఆయా దవాఖానలను పరిపుష్టం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. కార్పొరేట్ తరహాలో భవనాల ఆధునీకరణ, వసతుల కల్పన, వైద్యులు, సిబ్బంది నియామకం వంటి చర్యలు చేపట్టి నిరుపేదలకు భరోసా కల్పించారు.
కానీ, గత రెండేళ్లుగా వాటిని పట్టించుకునే నాథుడే లేడు. మధిర, సత్తుపల్లిలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రులను కనీసం ప్రారంభించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు పాలన ఉండటంతో ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. సహజంగానే ప్రతి ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు జ్వరాల సీజన్ కొనసాగుతుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనా వేయాలి. జిల్లా వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ వంటి కీలక శాఖలను రంగంలోకి దింపి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయాలి. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా కనిపిస్తుండటంతో ‘మార్పు’ మా కొంప ముంచిందని నిట్టూరుస్తుండటం గమనార్హం.