Taliperu Project | చర్ల, జూలై 12 : ఏజెన్సీ ప్రాంతంలో చిన్న చిన్న జల్లులు తప్ప ఇంకా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరు అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా తాలిపేరు, ఇతర చెరువుల కింద ఆయకట్టు కళతప్పినట్లుగా కన్పిస్తోంది. అక్కడక్కడా కొందరు రైతులు నారుమళ్లను వేస్తుండడం, పొలాలను సిద్ధం చేస్తుండడం వంటి దృశ్యాలు కన్పిస్తున్నప్పటికీ వరి సాగు పెద్దగా ముందుకు కదలడం లేదు. సరైన వర్షాలు కురవకపోవడం, జలాశయాల్లోనూ నీరు లేకపోవడం వంటి కారణాలతో కర్షకులు కూడా ఆందోళన చెందుతున్నారు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం కింద చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల పరిధిలో 24,400 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కేవలం చర్ల మండలంలోనే ఏటా 17 వేల ఎకరాల్లో వరి సాగవుతుంటుంది. ఇందులో కేవలం ఏడు వేల ఎకరాలు తాలిపేరు రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల కింద, మరో పది వేల ఎకరాలు వర్షాధారం, చెరువులు, కుంటల కింద సాగవుతుంటాయి. అయితే ఈ వానకాలంలో జూలై నెల కూడా ప్రవేశించి పక్షం రోజులు అవుతున్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో మధ్యతరహాకు చెందిన తాలిపేరు సాగునీటి ప్రాజెక్టులో ఇప్పుడు నీళ్లు అడుగంటడం, వర్షాలు కూడా సమృద్ధిగా కురవకపోవడం వంటి కారణాలతో ఇక్కడి అన్నదాతలందరూ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
0.73 టీఎంసీల సామర్థ్యం కలిగిన తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులోకి ఇంకా ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి వస్తున్న నీటిని నిలుపుతాం. రైతుల అవసరాలకు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవలేదు. ఇప్పటికైనా గట్టి వర్షాలు రాకపోతే పంటల సాగుకు ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే అక్కడక్కడా రైతులందరమూ పొలాలను దున్ని సిద్ధంగా ఉంచుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో రైతులు నార్లు కూడా పోసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద వర్షాలు పడితే పనులు ముందుకు సాగుతాయి.