చర్ల, జూలై 18 : రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు 22 గేట్లను రెండడుగుల మేర ఎత్తి 26,958 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువన తేగడ వద్ద గల కల్వర్టు నీటిలో మునిగిపోయింది. తాలిపేరు ప్రాజెక్టులోకి ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచామని డీఈ తిరుపతి, ఏఈ ఉపేందర్ తెలిపారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదారి
భద్రాచలం, జూలై 18: భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. సోమవారం రాత్రి 8 గంటలకు 11.7 అడుగులు ఉన్న గోదావరి మంగళవారం ఉదయం 10 గంటలకు 15.9 అడుగులకు చేరింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మరో అడుగు పెరిగి 16.9 అడుగులకు చేరుకుంది. రాత్రి 8 గంటలకు 20.5 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తుండడంతో అధికారులు 15 గేట్లను ఎత్తి 9 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం నాటికి 25 నుంచి 30 అడుగులకు గోదావరి వరద పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు.