కొణిజర్ల, నవంబర్ 6 : 60 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆ హామీలను వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొణిజర్ల మండలంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎంపీ నామా హాజరయ్యారు. వైరా అభ్యర్థి మదన్‌లాల్‌తో కలిసి రాజ్యాతండా, అమ్మపాలెం, తనికెళ్ల, తుమ్మలపల్లి, బోడియాతండా, అన్నవరం, రామనర్సయ్యనగర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. వైరా నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు. ఖమ్మంలో ఇటీవల జరిగిన ప్రజాశీర్వాద సభకు హాజరైన సమయంలో వైరా రిజర్వాయర్ పరిధిలో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తాను, మదన్‌లాల్ కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయంగా రూ.73 వేల కోట్లను ‘రైతుబంధు’ కింద అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని వివరించారు. రైతుబంధులాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు. రైతుబీమా మాదిరిగానే ప్రజల కోసం కేసీఆర్ బీమాను కూడా అమలు చేయనున్నట్లు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌లాల్ పేర్కొన్నారు. ఇందుకోసం ఆయనను హ్యాట్రిక్ సీఎంను చేద్దామని పిలుపునిచ్చారు. ఆయన ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనకు మరింత మెజార్టీ అందించాలని కోరారు. తనను గెలిపిస్తే వైరాను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వై.చిరంజీవి, ఏలూరి శ్రీనివాసరావు, పోట్ల కవిత, డేరంగుల వెంకటరమణ, చల్లా మోహన్‌రావు, ఎం.సురేశ్, సీహెచ్ నాగేంద్రమ్మ, రాయల నాగేశ్వరరావు, కాంతమ్మ, పోట్ల శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, డేరంగుల బ్రహ్మం, చల్లగుండ్ల నరసింహారావు (బుజ్జి), కిలారు కిరణ్, పాముల వెంకటేశ్వర్లు, జడ మల్లేశ్‌యాదవ్, బీ.కృష్ణ, చెరుకుమల్లి రవి, కిలారు మాధవరావు, బండారు కృష్ణ, దావా విజయ్, చల్లగుండ్ల రమేశ్, వడ్లముడి శివ, అనుమోలు శ్రీను, రావుల వెంకయ్య, దుగ్గిన్ని శ్రీను, ధరావత్ బాబులాల్, భూక్యా మీటు, భూక్యా రాంలాల్, చల్లా నరసింహారావు, కొర్రా కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.