బోనకల్లు, ఏప్రిల్ 14 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. సోమవారం బోనకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర ఎర్ర జెండా ఎగరవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను నేడు మనం ముందుకు తీసుకుపోవటమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వీరులు ప్రజల కోసం తమ ప్రాణాలు బలిదానం చేశారన్నారు. కానీ నేడు గ్రామాల్లో తిరిగి కొత్త రూపాల్లో దోపిడీ, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు పెరుగుతున్నాయని వాటిని తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పారుపల్లి చందు నరసింహారావు, చావ వీరభద్రం చావావెంకటేశ్వర్లు, సిపిఐ పారుపల్లి నరసింహారావు, ఏలూరి రమేశ్, కాంగ్రెస్ నాయకులు గంగసాని రాఘవరావు, గాదె కృష్ణారెడ్డి, కేసర లక్ష్మారెడ్డి, చావా గోపాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు వంగల కృష్ణ పాల్గొన్నారు.