పెనుబల్లి, ఫిబ్రవరి 7: పెనుబల్లి మండలం బ్రాహ్మలకుంట శివారు మామిడితోటలో చిరుతపులి పాదముద్రలను గురువారం రాత్రి గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేశారు. రాత్రివేళ ఎవరూ బయటకు రావొద్దని, చిరుతలు ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తాయని చాటింపు వేశారు. శుక్రవారం ఉదయం తల్లాడ రేంజ్ అధికారి ఉమ తమ సిబ్బంది, తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంపీడీవో అన్నపూర్ణలతో కలిసి మామిడితోటను సందర్శించారు.
చిరుతపులి తిరిగిన ప్రదేశంలో పాదముద్రల కొలతలు సేకరించారు. వన్య ప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అని, ఏదైనా అత్యవసరమైతే అటవీ శాఖ అధికారులకు తెలపాలని రేంజ్ ఆఫీసర్ సూచించారు.