ఖమ్మం, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, చేనేతశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ గట్టిగానే తగిలింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చుట్టుముట్టారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేశారు. ముందుగా కలెక్టరేట్ పక్కనే ఉన్న వీ.వెంకటాయపాలెం గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శన చేశారు. ధర్నా సమయంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ప్రధాన గేటు వద్ద రైతులు అడ్డగించారు.
రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు, రైతుసంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చేస్తున్న జాప్యం వారికి శాపంగా మారిందన్నారు. రోజుకో కొర్రీ పెడుతూ రుణమాఫీ చేయకుండా దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కేవలం 50శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, ప్రభుత్వ లెక్కలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో 30శాతం మందికి కూడా రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చెబుతున్న లెక్కలకు, అధికారిక లెక్కలకు పొంతన లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎప్పటివరకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తారో సరైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలోపు రుణాలు మాఫీ చేసిన ఖాతాల సమస్య కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. రేషన్‌కార్డు లేనివారికి, పహాణీలతో రుణాలు తెచ్చుకున్న వారికి ఈ పథకం వర్తింప చేయకపోవడవం న్యాయంకాదన్నారు. రేషన్‌కార్డు నిబంధన, రెండు లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు వెంటనే ఆ పై మొత్తాన్ని ముందుగా చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామనడం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు.
ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో రుణమాఫీ జమ కావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 30వ తేదీలోపు 2లక్షల రుణమాఫీ జరగాలని లేదంటే రైతులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియను జాప్యం చేయకుండా సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2లక్షల పైన ఉన్న రైతుల రుణమాఫీ విషయంలో మంత్రివర్గం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతుభరోసా డబ్బులను కూడా ఈ వానకాలం పంటలకు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పతనం తప్పదని హెచ్చరించారు.
అర్హులందరికీ రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వామపక్ష పార్టీ, రైతు సంఘాల నేతలు రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట మంత్రిని చుట్టుముట్టడంతో కారు దిగిన మంత్రి తుమ్మల వారితో మాట్లాడారు. రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు 40 బ్యాంకుల ద్వారా 5,782 బ్రాంచిల నుంచి రుణాలు తీసుకున్నారని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ప్రక్రియ అమలు అవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు రైతుల ఖాతాల నుంచి తిరిగి రుణాలుగా పొందారని, మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరగకనే రుణమాఫీ అమలు ఆలస్యమవుతున్నది తప్ప ప్రభుత్వపరంగా ఎలాంటి జాప్యం లేదన్నారు.
మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి అక్కడే కుటుంబసభ్యుల ఫొటోలను ప్రత్యేకయాప్లో అప్లోడ్ చేస్తారని తద్వా రా రుణమాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ అవుతుందన్నారు. రేషన్‌కార్డులు, పాస్ పుస్తకాలు లేకపోయినా రుణమాఫీ అమలు అవుతుందన్నారు. రెండు లక్షలకు పైన ఉన్న రైతులు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తేనే ప్రభు త్వం తరఫున రెండు లక్షలు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు త్వరలో విడుదల చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కుటుంబాలను రుణ విముక్తలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు ఎటువంటి అనుమానాలకు గురికావద్దన్నారు.
ధర్నాలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతుసం ఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు, సీపీఐ, సీపీ ఎం పార్టీల నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్కే జానీమియా, పోటు కళావతి, బండి రమేశ్, పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ధర్నా అనంతరం రైతుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ రెండు పార్టీలు నేతలు, రైతు సంఘాల నేతలు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
రుణమాఫీ అమలు చేయాలని ధర్నా చేస్తున్న రైతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్న ఓ రైతుపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. రుణమాఫీపై రైతులు మాట్లాడుతుండగా ఒక దశలో సహనం కోల్పోయిన మంత్రి ఓ రైతుపై చేయి చేసుకునే యత్నం చేశారు. రైతులను రెచ్చగొట్టడం ఎవరికీ తగదని హెచ్చరించారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. దీంతో మంత్రి తుమ్మల మాట్లాడుతూ అర్హులైన రైతులందరికి రుణమాఫీ వస్తుందని హామీ ఇచ్చారు.