ఇల్లెందు/గుండాల, జూలై 3 : వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారకముందే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ ఎరువుల కోసం ఇంతటి ఇబ్బందులు పడలేదని, మున్ముందు పంట ఎదుగుతున్నకొద్దీ ఎరువులు అవసరమైతే పరిస్థితి ఏమిటని ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు.
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ ఎరువుల గోడౌన్ వద్దకు, గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్దకు గురువారం తెల్లవారుజామున భారీగా చేరుకున్న సొసైటీ పరిధిలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులకు యూరియా అవసరం ఉంది. ఈ క్రమంలో ఆధార్ కార్డులతో యార్డుకు, పీఏసీఎస్‌కు చేరుకున్న రైతులు క్యూలో నిల్చునే ఓపిక లేకపోవడంతో జిరాక్స్ ప్రతులను అధికారుల ముందు వరుసగా పెట్టి యార్డు షెడ్ల కింద, చెట్ల కింద, రోడ్ల వెంట రోజంతా కూర్చున్నారు.
ఇల్లెందులో ఒక్కో కార్డుకు రెండు చొప్పున బస్తాల యూరియా బస్తాలు ఇస్తుండగా.. ఇంకా ఎక్కువగా కావాల్సిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం చూసి ఎకరాకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే గుండాల మండలానికి కేవలం నాలుగు లోడ్ల యూరియా రావడంతో అవి అందుతాయో లేదోనని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
యూరియా బస్తాల కోసం వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొలకరిలోనే సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. సకాలంలో రుణమాఫీ, రైతుభరోసా రాక సతమతమవుతుంటే.. ఇప్పుడు యూరియా కోసం రోజులకొద్దీ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు అవసరాల దృష్ట్యా రైతులకు సరిపోయే యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
అప్పటి కాంగ్రెస్ రోజులు గుర్తొస్తున్నాయ్..
12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రోజులతరబడి ఎరువుల షాపుల చుట్టూ తిరిగాం. ఈ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. మూడు రోజులుగా యూరియా బస్తాల కోసం తిరుగుతున్నాం. గోడౌన్ వద్దకు ఉదయం 9 గంటలకు వచ్చాం. అప్పటికే 230వ నెంబర్ నాది. మా వరకు బస్తాలు ఉంటాయో? లేదో? తెలియదు. ఇలా అయితే పంటలు పండించుకున్నట్లే.
-నున్నా నర్సింహారావు, రైతు, కట్టుగూడెం, ఇల్లెందు మండలం
పొద్దంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది..
రైతులకు తొలకరిలో కావాల్సిన ఎరువులు, విత్తనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందో తెలియడం లేదు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలపై అధికారుల, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. వర్షాలు కురుస్తున్నందున సాగు పనులు చేసుకోవాల్సిందిపోయి.. యూరియా కోసం పొద్దంతా ఇక్కడే గడపాల్సి వస్తోంది. ఏం అర్థం కావట్లేదు.
-కూరపాటి కనకయ్య, రైతు,రేపల్లెవాడ, ఇల్లెందు మండలం
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం..
ఇల్లెందు మార్కెట్ యార్డులోని ఎరువుల గోడౌన్ వద్ద రైతులకు యూరియా బస్తాలు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సొసైటీ సిబ్బందికి సైతం సూచనలు చేశాం. పీఓఎస్ మిషన్‌లో రైతుల ఆధార్‌తోపాటు తంబ్ తీసుకోవడం సాంకేతికంగా కొంత ఆలస్యంగా జరుగుతున్నది. రైతులందరికీ ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటాం.
-సతీశ్, ఇల్లెందు ఏవో