– తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్ కుమార్
కరకగూడెం, మే 13 : అడ్డదారిన ఎస్టీ రిజర్వేషన్‌ను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుండి వెంటనే తొలిగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు కొమరం భీం విగ్రహం వద్ద ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 3న మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పాకాల కొత్తగూడలో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలిగించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1976 నుండి 2026 వరకు 50 ఏండ్లుగా ఆదివాసీల రిజర్వేషన్లను అక్రమంగా అనుభవిస్తూ ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం నోరు మెదకపోవడం అసమర్ధత పాలనకు నిదర్శనమన్నారు.
లంబాడీ వల్ల ఏజెన్సీ ఆదివాసీ యువత ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు పడుతూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో రైతుల పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉందని పోడు భూములకు పట్టాలు రాక, ఉన్న భూముల్లో బోర్లు వేసుకుందామన్నా, సేద్యం చేద్దామన్నా అటవీ అధికారులు గిరిజన రైతులను నానా అవస్థలు పెడుతున్నట్లు తెలిపారు. త్వరలో జరగునున్న భారీ భహిరంగ సభకు అన్ని గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి ఐక్యతతో ప్రభుత్వానికి ఆదివాసీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సుతారి నాగేశ్వరరావు, కలం సంపత్ కుమార్, సాంబమూర్తి, చందా రామకృష్ణ, నాగకృష్ణ, స్వామి ప్రసాద్, రాజు, వెంకటేశ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.