కారేపల్లి, మార్చి 23 : గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణకు ఆదరణ కరువైంది. పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన అంశాలతో పాటు గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, పంచాయతీ విధులు, నిధులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా ఎంపిక చేసి వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని అప్పాయిగూడెం రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు వార్డు సభ్యులు నామమాత్రంగా హాజరు కావడంతో అధికారులు శిక్షణ తరగతులను మ..మ.. అనిపిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులను మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపులో 116 మందికి పైగా చొప్పున వార్డు సభ్యులను చేర్చి మూడు విడతలుగా ఐదు రోజులు శిక్షణ ఇస్తున్నారు.
మొదటి విడతలో భాగంగా సోమవారం నిర్వహించిన శిక్షణకు 116 మంది వార్డు సభ్యులు హాజరు కావాల్సి ఉండగా సగం మందికి అటు ఇటుగా మాత్రమే హాజరయ్యారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పాలన పరమైన శిక్షణకు ఐదు రోజులు సమయం కేటాయించని వార్డు సభ్యులు ఐదు సంవత్సరాలు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంత చిత్తశుద్ధితో పని చేయగలుగుతారో అని వివిధ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వార్డు సభ్యుల శిక్షణకు సభ్యులు హాజరు కాకపోవడం అంటే అది శిక్షణ లోపమా? శిక్షకుల లోపమా? అధికారుల లోపమా? అనే ప్రశ్న తలెత్తుతున్నాయి. నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలక మండలి సభ్యులతో అధికారులు సమన్వయం చేసుకుని శిక్షణ తరగతులను జయప్రదంగా నిర్వహించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.