మామిళ్లగూడెం, డిసెంబర్ 26: ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఖమ్మం నూతన కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అమలుజేసే బాధ్యత అధికారులపై ఉందని, పేదల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు స్పందించి పరిషార చర్యలు తీసుకోవాలని, క్లిష్టమైన సమస్యలుంటే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ప్రజాపాలన ద్వారా ఒక్కో సమస్యనూ పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని, ఇది మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటోందని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి అమలు చేస్తున్నామని అన్నారు. 100 రోజుల్లోపే హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అధికారులు టీమ్‌గా విధులు నిర్వర్తించాలని, రోజుకు 18 గంటలు కష్టపడాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలనూ అమలు చేస్తామని అన్నారు. ప్రజాపాలనపై అధికారులు స్పష్టత రావాలని, కార్యక్రమం బాగా జరిగిందనే కీర్తి పొందాలని సూచించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని పని దినాల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. గ్రామసభల షెడ్యూల్‌ను ప్రజలకు ముందస్తుగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్, నీడ కోసం షామియానా ఏర్పాటు చేయాలని, తాగునీరు సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంయత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ బీ.సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో 59 బృందాలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయని వివరించారు. సత్తుపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, భద్రాద్రి అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్‌రాజు, ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.