రామవరం, మే 31 : ‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది రెండోసారి అని. గతంలో 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఇలాగే వ్యవహరించారు. ప్రజల చేత ఎన్నికైన తనను ప్రజాప్రతినిధిగా చూడరా? డిప్యూటీ సీఎంను సంస్థ సీఎండీ బలరాం దగ్గరుండి తీసుకొచ్చారు. తనను జీఎం స్థాయి అధికారి కూడా తీసుకురారా? అని ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని త్రీ ఇైంక్లెన్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్‌షాప్, కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయాల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో ఫొటో లేకపోవడంపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అసలు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఏమిటో కూడా తనకు చెప్పేవారు లేరని, ఇదేం పద్ధతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లో ఉన్న పర్సనల్ విభాగం సిబ్బంది సమన్వయంతో పని చేయకపోవడం వల్లనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ప్రొటోకాల్ వివాదం నేపథ్యంలో సీపీఐ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనా? లేక సభ జరిగే సమయంలో సభా ప్రాంగణంలో జనాలు లేకపోవడం వల్లనా? ఏదేమైనా సభ నిర్వహించపోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. అసలు షెడ్యూల్లో సభ లేదని అధికారులు చెబుతుండగా.. లక్షలు పెట్టి సభా స్థలిని ఎందుకు ఏర్పాటు చేశారని కార్మికులు అంటున్నారు. దీనిపై ఏరియా జీఎం శాలెంరాజును వివరణ కోరగా.. ప్రొటోకాల్ విషయంలో కొంత పొరపాటు జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు.