కొత్తగూడెం గణేష్టెంపుల్/ పాల్వంచ/ ఇల్లెందు/ మణుగూరుటౌన్/ బూర్గంపహాడ్/పినపాక, మే 6 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతను వెంటనే నివారించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం వల్లనే సామాన్య ప్రజలపై నిత్యావసర భారాలు పెరుగుతున్నాయని అన్నారు.
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, కార్పొరేట్ శక్తుల దోపిడీని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, మేయర్ మూడు గణేష్, శ్రీనివాస్, జమలయ్య, శ్రీనివాస్, మురళి, వెంకట్, యూసుబ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పాల్వంచలో చండ్ర రాజేశ్వరరావు భవన్ వద్ద నుంచి ప్రదర్శనగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాథం, సాయిబాబా, పూర్ణచంద్రరావు, రాహుల్, విశ్వేశ్వరరావు, పద్మజ పాల్గొన్నారు. ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్లో ఖాళీ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి నాయకుడు కె.సారయ్య మాట్లాడుతూ డీజిల్ కొరత రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. శంకర్, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలో రాష్ట్ర సమితి సభ్యుడు సరెడ్డి పుల్లారెడ్డి మాట్లాడుతూ రవాణా వ్యవస్థ పూర్తిగా కుంటుపడుతుందని అన్నారు. రాజబాబు, సుధాకర్, మోహన్‌రావు, వీరయ్య, ఉషారాణి పాల్గొన్నారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వారిలో నాగేశ్వరరావు, సత్యనారాయణ, సీతారాంరెడ్డి, పుల్లయ్య, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.