పాల్వంచ రూరల్, జనవరి 4: క్రీడాకారులైన పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నానని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ప్రియాంక ఆల అన్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో బుధవారం ఆమె ఐటీడీఏ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు జాతీయ క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. గురుకుల పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, రాందాస్ నాయక్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
విద్యార్థులు విజ్ఞానాన్ని సంపాదించాలన్నారు. జడ్పీ చైర్మన్కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని ఎదగాలన్నారు. తొలుత అతిథులు క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్చరీ పోటీలను కలెక్టర్ ప్రియాంక ఆల ప్రారంభించగా వాలీబాల్ పోటీలను ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, రాందాస్‌నాయక్ విద్యార్థులతో కలిసి క్రీడలు ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, ఇతర అధికారులు రమణయ్య, అలివేలు మంగతాయారు, బొల్లి గోపాల్‌రావు, వెంకటనారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, నెహ్రూ పాల్గొన్నారు.